మిర్యాలగూడ, జూన్ 5 : ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మంటలు వ్యాపించడంతో గ్యాస్ సిలిండర్ కూడా పేలింది. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. భర్త చనిపోయి సరిగ్గా నెలరోజులు కావస్తుండటం.. నెల మాసికానికి ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో భార్య చనిపోవడం అందరిని కలిచివేసింది. స్థానికుల కథనం ప్రకారం.. వనం చంద్రకళ (45) పట్టణంలోని కలాల్ వాడలోని ఓ రేకుల ఇంట్లో నివాసం ఉంటున్నది. తన కూతురు ధనమ్మ పిల్లలైన లక్ష్మణ్ (16), ప్రణతి (14) కూడా ఆమెతోనే ఉంటున్నారు. చంద్రకళ పట్టణంలోని పలు ఇండ్లల్లో పనులుచేస్తూ జీవనం సాగిస్తున్నది. చంద్రకళ కూతురు ధనమ్మ భర్త పదేండ్ల క్రితమే మరణించాడు. అయితే ఆమె కొడుకు, కూతురిని తల్లి వద్ద ఉంచి హైదరాబాద్‌లో పనిచేసుకుంటూ అక్కడే ఉంటుంది. నెల రోజుల క్రితమే చంద్రకళ భర్త సైదులు మృతి చెందాడు. ధనమ్మ మిర్యాలగూడకు వచ్చి తండ్రి అంత్యక్రియలు పూర్తిచేసింది.
కొద్దిరోజులపాటు ఇకడే ఉండి పని కోసం పుణెకు వెళ్లింది. తన ఇద్దరు పిల్లల్ని తల్లి వద్దే ఉంచి వెళ్లింది. శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో షార్ట్ సర్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. అదే గదిలో గ్యాస్ సిలిండర్ కూడా ఉండటంతో మంటల ధాటికి గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. చంద్రకళతోపాటు ఆమె మనుమడు, మనుమరాలికి మంటలు అంటుకుని బయటికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో గదిలోనే సజీవ దహనమయ్యారు. మంటలు, పొగలు రావడాన్ని గమనించిన పకనే ఉండే చంద్రకళ బంధువులు వచ్చి చూసేసరికి వారు అప్పటికే చనిపోయి ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. డీఎస్పీ రాజశేఖర్‌రాజు, సీఐ నాగభూషణరావు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను ఏరియా దవాఖానకు తరలించారు. శనివారం.. భర్త సైదులు నెల మాసికం ఉండగా చంద్రకళ అందుకోసం ఏర్పాట్లు చేసుకున్నది. ఇంతలోనే ఘోరం జరిగిందని బంధువులు ఆవేదన చెందారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నాగభూషణరావు తెలిపారు.