Hyperrealism ( Hyper Realistic Painting ) | టైడ్ యాడ్ చూసి మీరు అవాక్కయినా, కాకపోయినా ఈ చిత్రాల గురించి తెలిస్తే మాత్రం.. తప్పకుండా అవాక్కవుతారు. ఎందుకంటే, ఇక్కడ కనిపిస్తున్నవి అందమైన అమ్మాయిల ఫొటోలు కావు, అచ్చెరువొందించే పెయింటింగ్స్. నిజంగానే ఒక చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన కళాఖండాలు. హై డెఫినిషన్ ఫొటోలను పోలిన ఈ బొమ్మలు సదరు చిత్రకారుడికి ఎంతోమంది అభిమానుల్ని సంపాదించి పెట్టాయి.
ఎంత జీవం ఉట్టిపడేలా గీసినా సరే… సాధారణంగా పెయింటింగ్స్‌ను చూడగానే మనం గుర్తుపట్టేస్తాం. కానీ నవతరం చిత్రకారులు సరికొత్త బాటపట్టారు. హైపర్ రియలిస్టిక్ చిత్రాలను గీయడంలో మహా నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. ఫొటోనా, పెయింటింగా? అన్నది గుర్తుపట్టలేనంత ప్రత్యేకంగా వీటిని తీర్చిదిద్దుతున్నారు. అందులోనూ హై డెఫినిషన్ ఫొటోలను పోలిన చిత్రాలు గీయడంలో దిట్ట బ్రెజిల్‌కు చెందిన ఫాబియానో మిలానీ. సహజత్వానికి అతి దగ్గరగా రంగులను మేళవించి కాన్వాసుపై కనులవిందు చేయడం ఇతనికి కుంచెతో పెట్టిన విద్య. అందుకే హైపర్ రియలిస్టిక్ ఆర్టిస్టుల సంఘంలో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఈయన గీసిన చిత్రాల్లో ముఖం మీద తేనె జాలువారుతున్నట్టు కనిపించే బొమ్మ మంచి పేరు తెచ్చిపెట్టింది. చిత్రాలు గీసేందుకు ముందుగా అందమైన మోడళ్లను ఎంచుకుని, లైటింగ్ కుదిరేలా అద్భుతమైన ఫొటోలు తీయిస్తాడు. వాటి ఆధారంగా అచ్చు గుద్దినట్టు అలాంటి వర్ణాలనే రంగరించి కాన్వాసును అలంకరిస్తాడు. చిన్ననాటి నుంచి చిత్రలేఖనం మీద ఉన్న ఇష్టంతో అందులో ప్రత్యేక కోర్సు చేసిన మిలానీ ప్రస్తుతం తన స్టూడియోలో చాలామంది విద్యార్థులకు కుంచెసాము నేర్పిస్తున్నాడట. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈయనకు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి… నే చిత్తరువయితినయ్యో… అని పాడుతున్నారు.
టాలెంట్‌కు చేతులతో పనేంటి.. కాళ్లు, నోటితోనే అద్భుతమైన బొమ్మలు గీసేస్తున్నరు !!”