Selfie Cake | దేవుళ్ల శిల్పాలకు దండం పెట్టుకుంటాం. విప్లవవీరుల శిల్పాలకు పిడికిలి బిగించి అంజలి ఘటిస్తాం. అభిమాన నాయకుడి శిల్పాలకు క్షీరాభిషేకం చేస్తాం. కానీ, ఇప్పుడు పరిచయం చేసే శిల్పాలను మాత్రం.. అబ్బురంగా చూస్తాం. లటుక్కున కొరికేస్తాం! ‘ఎంతో రుచిరా…’ అని పాడుకుంటాం. అవే ‘సెల్ఫీ కేక్స్’. వీటికి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి.
కాలేజీ ఫంక్షన్ అయినా, బర్త్‌డే పార్టీ అయినా, బ్రేకప్, ప్యాచప్.. సందర్భమేదైనా అక్కడ కేకు ఉండి తీరాల్సిందే. ఓ సెల్ఫీ క్లిక్కుమనాల్సిందే. ఈ రెంటినీ కలిపితే ఎలా ఉంటుందీ? అని ఆలోచించారు కేకు తయారీదారులు. ‘సెల్ఫీ కేక్’ మెరుపులాంటి ఐడియా! ఇదిగో… ఇక్కడ కనిపిస్తున్న కేకులన్నీ ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చినవే.
ఒకప్పుడు కేక్ అంటే ఓవెన్ సాయంతో కాస్త విభిన్నంగా చేసే వంటకం. కానీ ఇప్పుడు కేక్ తయారీ ఓ కళ. ఫొటో కేకులు, సిండ్రెల్లా కేకులూ, థీమ్డ్ కేకులు.. ఇలా విభిన్న రూపాల్లో, రంగుల్లో ఆకట్టుకుంటున్నాయి. బేకర్లు కూడా దాన్ని కళ్లు తిప్పుకోలేనంత ఆకర్షణీయంగా రూపొందించేందుకు ఎంతో శ్రమ పడుతున్నారు. చూడగానే కట్టిపడేసేంత ప్రత్యేకంగా, ఇవి నిజంగా కేకులేనా అనిపించేంత విభిన్నంగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న సెల్ఫీ కేకులూ అలాంటివే. ఒక ఫొటో ఆధారంగా అచ్చం అదే మనిషిని పోలిన కేకు శిల్పం చెక్కుతున్నారు.
ఇవెంత సహజంగా ఉంటాయంటే.. చటుక్కున చూసిన వాళ్లెవరైనా ఇది కేకు అని గుర్తుపట్టలేరు. ఈ కేకు బొమ్మల్ని కట్ చేసి, ఆ తర్వాత తినిపిస్తే కానీ నిజమైన కేకేనని ఎవరూ నమ్మడం లేదట. ఒక్కమాటలో చెప్పాలంటే మనిషినీ బొమ్మనూ పక్కపక్కనే పెట్టి ఫొటో తీస్తే ఏది కేకూ, ఏది మనిషీ అన్నది వెంటనే గ్రహించలేనంత జీవకళ ఉట్టిపడుతుంటుంది. వీటిని సాధారణ కేకుల్లాగే పైనాపిల్, బటర్‌స్కాచ్, రెడ్వెల్వెట్.. ఇలా రకరకాల ఫ్లేవర్లలో తయారుచేస్తారు. తర్వాత దానిమీద షుగర్ ఫాండెంట్ పొరను కప్పుతారు. బాగా సునిశితంగా రావాలంటే మోడలింగ్ చాకొలెట్గా పిలిచే ఫాండెంట్ తరహా పదార్థాన్ని దీనికోసం వాడతారు.
తర్వాత కావలసిన ఫొటోను చూస్తూ చాకుల్లాంటి పదునైన వస్తువులు, కొన్ని ప్రత్యేక పరికరాల సాయంతో ఫాండెంట్ మీద కళ్లూ ముక్కూ నోరు, వెంట్రుకలు వగైరా తీర్చిదిద్దుతారు. దానిమీద ఎడిబుల్ రంగులను అద్ది ఫొటోలో ఉన్నట్టే అచ్చుగుద్దినట్టు బొమ్మను తయారుచేస్తారు. ఎంచుకున్న చిత్రాన్నిబట్టి తయారీకి మూడు నాలుగు రోజులు మొదలు కొన్ని వారాల వరకూ సమయం పడుతుంది. ఖరీదు మాత్రం చాలా ఎక్కువ. టర్కీకి చెందిన తుబా గెకల్, అమెరికాకు చెందిన నటాలీ సిడెసెర్ఫ్ సెల్ఫీ కేకుల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గడించారు. వీటిని ఎలా తయారు చేస్తారన్న వీడియోలూ యూట్యూబ్‌లో ఉన్నాయి. కావాలంటే చూడండి… చేసే ప్రయత్నమూ చేస్తామంటే మాత్రం తర్వాత మీ ఇష్టం!
“RRR | ట్రిపుల్ ఆర్ కుకింగ్ గురించి తెలుసా? దీనివల్ల లాభమేంటి?”
టాలెంట్‌కు చేతులతో పనేంటి.. కాళ్లు, నోటితోనే అద్భుతమైన బొమ్మలు గీసేస్తున్నరు !!”
“కాగితాలతో అబ్బురపరిచే శిల్పాలు తయారు చేస్తున్నాడు”