రెస్టరెంట్ల చెఫ్లతోపాటు గృహిణులు కూడా జీరో వేస్ట్ కుకింగ్ పద్ధతినే ఎంచుకుంటున్నారు. వంట చేసేటప్పుడు ఎక్కువ వ్యర్థాలు పోగవకుండా, ఆహార పదార్థాలు వృథా కాకుండా జాగ్రత్తపడుతున్నారు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్.. పద్ధతిని పాటిస్తున్నారు. దీనినే ‘ఆర్ఆర్ఆర్’ అని ట్రెండీగా పిలుస్తున్నారు. ఈ పద్ధతిలో వంటకు కావాల్సిన పదార్థాలను తక్కువగా ఉపయోగించడం, కూరగాయల తొక్కలు, గింజలను ఆయా ఫ్లేవర్లతో తయారుచేసే ఇతర వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. అలాగే వ్యర్థ పదార్థాలను మట్టిలో డీకంపోజ్ చేసి మొక్కలకు ఎరువుగా వాడుతూ జీరో వేస్ట్ కుకింగ్ సూత్రాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు.
ఏం కావాలి?
చికెన్: ఒక కిలో, సోయా సాస్: ఒక టేబుల్ స్పూన్, కారం: ఒకటిన్నర టేబుల్ స్పూన్, ధనియాల పొడి: ఒక టేబుల్ స్పూన్, నూనె: సరిపడా, నారింజ రసం: అర కప్పు, వెల్లుల్లి తరుగు: రెండు టీ స్పూన్లు, పాలకూర తరుగు: ఒక కప్పు, పచ్చిమిర్చి తరుగు: ఒక టీ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్: అర టీ స్పూన్, ఉప్పు: తగినంత.
ఎలా వండాలి?
ముందుగా నారింజ రసంలో ఉప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కలపాలి. అలాగే చికెన్ ముక్కలకు కారం, ధనియాల పొడి, సోయా సాస్ మిశ్రమం పట్టించాలి. మరోవైపు పొయ్యి మీద కడాయిలో నూనె వేడిచేసి, అందులో చికెన్ ముక్కలు, నారింజ రసం వేసి ఉడికించాలి. ముక్కలు ఉడికిన తర్వాత, అందులోనే పాలకూర, ఉప్పు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు జోడించి పది నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ చికెన్ బగారా అన్నంలో అద్భుతంగా ఉంటుంది.
కీరా దోస ప్రపంచవ్యాప్తంగా సాగు అవుతున్నా, అత్యధికంగా మనదేశం నుంచే వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నది. గత ఏడాది 20కోట్ల డాలర్ల ఎగుమతి జరిగినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, స్పెయిన్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్, శ్రీలంక, చైనా, రష్యా వంటి మొత్తం 20 దేశాలకు మనదేశం నుంచి కీరా దోసకాయలు ఎగుమతి అవుతున్నాయి.
పోషకాలు: పచ్చి కీరాదోసలో 95శాతం నీరు ఉంటుంది. 4శాతం కార్బొహైడ్రేట్లు, 1శాతం ప్రొటీన్ ఉంటుంది. నీటి శాతం అధికంగా ఉండటంవల్ల వీటితో అనేక ఆరోగ్య లాభాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. కీరాలోని విటమిన్-కె రక్తం గడ్డకట్టకుండా చేయడంతోపాటు ఎముకలకు దృఢత్వాన్ని ఇస్తుంది.
కాలేజీ విద్యార్థుల నుంచి కార్పొరేట్ ఉద్యోగుల వరకు చాలామంది ఫుడ్ బ్లాగర్స్, వ్లాగర్స్గా మారుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేకంగా ఫుడ్ బ్లాగ్‌ని ఏర్పాటుచేసుకుని ఆహారానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన తాన్య కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ‘thatgirlwithapron’ పేరుతో ఫుడ్ బ్లాగ్ నిర్వహిస్తున్నారు. ఆమె బ్లాగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పదిహేను వేల మందికిపైగా ఫాలో అవుతున్నారు. తను రుచి చూసిన రెస్టరెంట్ వంటకాల విశేషాలతోపాటు స్వయంగా వండివార్చిన పదార్థాల విశేషాలను ఈ బ్లాగ్‌లో పంచుకుంటున్నారు తాన్య. ఆమెకు ఫుడ్ ఫొటోగ్రఫీపై ఆసక్తి ఎక్కువ. అందువల్ల వివిధ ప్రాంతాల్లోని రకరకాల వంటల ఫొటోలను బ్లాగ్‌లో పోస్ట్ చేస్తుంటారు.
ఈ కాంబినేషన్ గురించి వింటేనే చాలామందికి నోరూరిపోతుంది కదూ! ఇటు వేడివేడి మసాలా దోశలో చల్లచల్లటి వెనిలా ఐస్‌క్రీమ్ అద్దుకొని తింటే ఆ మజానే వేరు అని అంటున్నారు బెంగళూరు వాసులు. ఒక తోపుడుబండి మీద తయారుచేస్తున్న ఈ సరికొత్త కాంబినేషన్ వీడియోని రికార్డు చేసి తన బ్లాగ్‌లో పోస్ట్ చేశాడు బెంగళూరుకు చెందిన ఫుడ్ బ్లాగర్ నవీన్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నది. మీరూ ఇంట్లో ఓసారి ప్రయత్నించి చూడండి.
హైదరాబాద్‌కు చెందిన రవితేజ జల్లెపల్లి ‘గోలీసోడా’ బ్రాండ్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ స్టార్టప్ ద్వారా ఆరోగ్యకరమైన పానీయాలను కస్టమర్లకు అందిస్తున్నారు. కొబ్బరి నీళ్లు, చెరకు రసం, బాదం పాలు, రోజ్ మిల్క్, ద్రాక్ష రసం, పుచ్చకాయ రసం, పానకం, మజ్జిగ మొదలైన ఉత్పత్తులను అందిస్తున్నది గోలీసోడా. దీనికి ప్రస్తుతం హైదరాబాద్‌లోనే పది అవుట్లెట్లు ఉన్నాయి. త్వరలోనే బెంగళూరు, చెన్నై వాసులకూ తమ రుచులను పరిచయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు గోలీసోడా నిర్వాహకులు. కేవలం పానీయాలే కాకుండా కద్దూ ఖీర్, పాయసం, సేమియా డంప్లింగ్స్, అరిసెలనూ విక్రయిస్తున్నారు. జొమాటో, స్విగ్గీ ద్వారా కూడా కస్టమర్లు ఈ ప్రత్యేక రుచులను తెప్పించుకోవచ్చు.
పక్కా మాంసాహారిని!
టాలీవుడ్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది నటి తాప్సీ పన్ను. ఇప్పుడు బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటున్నది. ఇటీవల ఆమె తన డైట్ గురించి చెప్పింది.
☛ ఉదయం లేవగానే ఒక లీటరు మంచి నీళ్లు తాగుతాను. తర్వాత బాదం, అంజీరా, వాల్నట్స్ తింటాను.
☛ నేను పక్కా మాంసాహారిని. శాకాహార రుచులనూ బాగా ఇష్టపడతాను. మాంసాహారంలో అన్ని రకాలూ ప్రయత్నిస్తాను.
☛ శాకాహారంలో ఎక్కువగా ఉత్తరాది వంటకాలను ఇష్టపడతాను. ఇంట్లో చేసిన మటర్ పనీర్‌కి పెద్ద ఫ్యాన్‌ని. అలాగే స్ట్రీట్ ఫుడ్‌లో చోలే బతురే, ఆలూ టిక్కీ నా అభిమాన రుచులు.
☛ అల్పాహారంలో క్యారెట్, బీట్రూట్, గూస్బెర్రీలతో చేసిన రసం తాగుతాను. గుడ్డు తెల్లసొనతో ఆమ్లెట్, గ్లూటెన్ఫ్రీ బ్రెడ్ తీసుకుంటాను. అదే బ్రెడ్‌తో పావ్బాజీని ఇష్టంగా తింటాను.
☛ మధ్యాహ్నం భోజనంలో ఇదీ అదీ అని ప్రత్యేకించి ప్లాన్ చేసుకోను. సాధారణంగా పప్పు, కూరగాయలతో భోజనం చేస్తాను. సలాడ్స్ తీసుకుంటాను. అందులో టమాట, ఉల్లి ఆకులు ఉండేలా చూసుకుంటాను. చపాతీ, పెరుగు జోలికి మాత్రం వెళ్లను.
☛ సాయంత్రం ఆకలేస్తే అటుకులు తింటాను. టీ అస్సలు తాగను. డెజర్ట్స్లో కేక్ ఇష్టం. ఆ మమకారాన్ని చంపుకోలేక వారానికోసారి మాత్రమే తింటా.
☛ మా అమ్మ, చిన్నమ్మ వంటలను ఎక్కువగా ఇష్టపడతాను. నేను మాత్రం వంట జోలికి వెళ్లే సాహసం చేయను. నన్ను నేను కాపాడుకోవాలి కదా! వంట చేయక తప్పదు అనుకుంటే మాత్రం నాకు నచ్చినట్లు, వచ్చినట్లు మ్యాగీ చేసుకుంటా.
మ్యాగీ రెసిపీ బై తాప్సీ
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక కప్పు నీళ్లు పోయాలి. అందులో ఒక టీ స్పూన్ నెయ్యి, రెండు టీ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు, మ్యాగీ మసాలా వేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మ్యాగీ నూడుల్స్ వేయాలి. అవి ఉడికాక దింపేయాలి.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
Kitchen Tips | స్వచ్ఛమైన తేనె ఎన్ని రోజులకు పాడవుతుందో తెలుసా
“Ice Cream | ఐస్‌క్రీం చల్లగా ఉందని రిఫండ్ కోరిన కస్టమర్!”
ఒకప్పుడు బొగ్గుతోనే పళ్లు తోమేవారు.. ఇప్పుడు అదే బొగ్గుతో కాఫీ, ఐస్‌క్రీంలు తయారీ.. ఎందుకు?”
“Health Tips | మూడ్ బాలేదంటే ఈ ఫుడ్‌ను పక్కనపెట్టాల్సిందే!”