‘ఏ మాయ చేసావె’చిత్రంతో తెలుగునాట కుర్రకారు గుండెల్లో వలపు బాణాల్ని విసిరింది తమిళ సోయగం సమంత. తొలి సినిమాతోనే తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది. అగ్రహీరోలతో జతకడుతూ దక్షిణాది తారాపథంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ భామ చిత్రసీమలో పన్నెండేళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. ‘ఉదయం నిద్రలేవగానే పన్నెండేళ్ల కెరీర్ పూర్తిచేసుకున్నాననే విషయం గుర్తొచ్చింది. లైట్స్, కెమెరా, యాక్షన్ మాటల నడుమ ఈ ప్రయాణం ఎన్నో మధురజ్ఞాపకాల్ని మిగిల్చింది. నా విజయాల్ని తలచుకున్నప్పుడల్లా మనసు కృతజ్ఞతాభావంతో నిండిపోతున్నది. నన్నెంతగానో ప్రేమించే అభిమానుల వల్లే ఈ సుదీర్ఘ కెరీర్ సాధ్యమైంది. సినిమాతో నా ప్రేమకథ అనంతంగా సాగిపోవాలని, భగవంతుడు నాకు మరింతగా శక్తిసామర్థ్యాల్ని సమకూర్చాలని వేడుకుంటున్నా’అని తన పోస్ట్‌లో సమంత పేర్కొంది. సినీరంగంలో పుష్కర ప్రయాణం పూర్తిచేసుకోవడం పట్ల సోషల్‌మీడియాలో సమంతకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.