హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు త్వరగా నిర్వహించాలని రవాణాశాఖ మంత్రి ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో కార్మికుల్లో అంతర్మథనం మొదలైంది. ఎన్నికల ప్రక్రియను సాకుగా చూపి.. ఆర్టీసీ విలీనాన్ని ఆలస్యం చేయాలని సర్కార్ చూస్తున్నదని కలత చెందుతున్నారు. కార్మికుల్లో ఉన్న ఆందోళనను పసిగట్టిన కార్మిక సంఘాల నేతలు కూడా మొదట విలీనమే చేయాలని కోరుతున్నారు. అయితే, ప్రభుత్వం మొదట ఎన్నికలు నిర్వహిస్తామని పట్టుపడుతుండటంతో మధ్యేమార్గంగా ఒక అపాయింటెడ్ డే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా ఒక తేదీ ఖరారు చేసుకుంటే.. దానికి ముందుగానే ఎన్నికలకు వెళ్లినా ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెబుతున్నారు.
ఆర్టీసీ కార్మికులు రెండుసార్లు సమ్మె నోటీసులు ఇచ్చినా, ఏప్రిల్లో మూడు రోజులు సమ్మె చేసినా.. అపాయింటెడ్ డేకు మోక్షం కలుగలేదు. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న కచ్చితంగా అపాయింటెడ్ డే ప్రకటిస్తారని ఎదురుచూసినా నిరాశే ఎదురైంది. విలీన ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన కమిటీలు ఏ ఒక్కటీ యాక్టివ్గా లేకపోగా, తమకు అత్యవసరం కాని ఎన్నికల ప్రతిపాదనను కార్మికుల ముందు ఉంచారు. విలీన అంశంపైనే ఏర్పడిన కమిటీ ఎలాంటి చర్చలు జరుపుతున్నది? ఎప్పటిలోగా ఆస్తుల పంపకాలపై ఒక నిర్ధారణకు వస్తారు? ఆర్టీసీ కార్మికులను ఎప్పుడు విలీనం చేస్తారు? వారికి ఎప్పుడు అపాయింటెడ్ డే ప్రకటిస్తారు? ఇవన్నీ చేయాలంటే కచ్చితంగా ఎన్నికలు జరుగాల్సిందేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎంతో క్లిష్ట ప్రక్రియ అయిన విలీనం వదిలిపెట్టి.. ఎన్నికల నిర్వహణ మీద దృష్టి పెట్టడం, ముఖ్యమంత్రి కూడా విలీనం అంశంపై సంఘాలు, కార్మికులు తేల్చుకోవాలని మెలిక పెట్టడం వెనుక కుట్ర దాగి ఉందని కార్మికులు అంటున్నారు.
ఈదురు వెంకన్న, ఆర్టీసీ కార్మిక జేఏసీ చైర్మన్, ఈయూ ప్రధాన కార్యదర్శి ఆర్టీసీ కార్మికుల్లో నెలకొన్న గందరగోళం, అపోహాలు తొలగించాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం ముందుగా విలీనానికి సంబంధించిన ఒక డేట్ ప్రకటించాలి. అదే అపాయింటెడ్ డేగా కార్మికులు భావిస్తారు. ఆ తర్వాత ఎప్పుడైనా మీరు ఎన్నికల ప్రక్రియను నిర్వహించుకోవచ్చు. ఏదైనా ఒక కాల పరిమితితో కూడిన ప్రకటన కచ్చితంగా చేయాల్సిందే. ఇది ఒక్క కార్మికులదే కాదు.. అన్ని యూనియన్ల డిమాండ్ కూడా. ప్రభుత్వం ఆ దిశగానే చర్యలు చేపట్టాలి. లేకపోతే కార్మికవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్ హామీలను నమ్మి ఓట్లు వేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారేమోనని ఎదురు చూస్తున్నారు.