న్యూఢిల్లీ, మార్చి 18: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల సంభవించే ప్రపంచ ఆర్థిక క్షీణత.. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) హెచ్చరించింది. చైనాపై ఈ యుద్ధ ప్రభావం వెంటనే పడినా.. దానివల్ల ఆ దేశానికి జరిగే నష్టం మాత్రం స్వల్పమేనని చెప్పింది. ‘యుద్ధం వల్ల వాటిల్లే ప్రపంచ ఆర్థిక పతనం.. భారతీయ ఆర్థిక వ్యవస్థపై అనేక రకాలుగా ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కరోనా సంక్షోభ సమయంలో కనిపించిన ప్రభావంతో పోల్చితే ఇది భిన్నంగా ఉండొచ్చు’ అని ఐఎంఎఫ్ సమాచార శాఖ డైరెక్టర్ గెర్రీ రైస్ విలేకరులతో అన్నారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ చమురు ధరల్లో వేగవంతమైన పెరుగుదల.. స్థూల ఆర్థిక సమస్యలతో వచ్చే ప్రధాన వాణిజ్య కుదుపు అన్నారు. ఇది అధిక ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా లోటుకు దారితీసే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. అయితే భారత్ నుంచి ఎగుమతులు జరుగుతున్న గోధుమల వంటి కమోడిటీ ధరల్లో పెరుగుదల.. కరెంట్ ఖాతా లోటును కాస్త శాంతింపజేయవచ్చన్నారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర నేపథ్యంలో రష్యాపై అమెరికా, దాని మిత్రదేశాలు, ఐరోపా దేశాలు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో రష్యాతో వ్యాపార, వాణి జ్య సంబంధాలు ఇరకాటంలో పడ్డాయి. ఇది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల్నీ ఇబ్బందులకు గురిచేస్తున్నది.
అమెరికా, ఐరోపా, చైనా ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూలంగా పడే యుద్ధ ప్రభావం.. భారత్‌కున్న ఎగుమతి అవకాశాలను దెబ్బ తీయవచ్చని రైస్ చెప్పారు. అలాగే రవాణా వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడి దిగుమతులూ నిలిచిపోవచ్చన్నారు. దీంతో దేశంలో ఆయా వస్తూత్పత్తుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని పేర్కొన్నారు. కీలక రంగాల్లో చోటుచేసుకునే అనిశ్చితి.. దేశ ఆర్థిక పరిస్థితులనూ ఇబ్బందుల్లోకి నెట్టవచ్చని, రుణాలు భారం కావచ్చని హెచ్చరించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం.. దేశ ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ఉంటుందన్నది కేంద్ర ప్రభుత్వ విధానాలపైనే ఆధారపడి ఉంటుందని ఈ సందర్భంగా రైస్ నొక్కిచెప్పారు. ఈ కఠిన పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే వ్యాపార, పెట్టుబడి అనుకూల నిర్ణయాలు ప్రధానమని సూచించారు. అధిక చమురు ధరలు దేశీయ వినియోగ సామర్థ్యానికి, కొనుగోళ్లకు, పెట్టుబడులకు విఘాతం కలిగిస్తాయని చెప్పారు. కాబట్టి ధరల నియంత్రణతో పరిస్థితులను వీలైనంత వరకు చక్కదిద్దుకోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వచ్చే నెల గ్లోబల్ ఎకనామిక్ ఔట్‌లుక్‌ను ఐఎంఎఫ్ విడుదల చేయనున్నట్టు తెలుస్తున్నది. ఈ సందర్భంగా ఆయా దేశాల జీడీపీ అంచనాలనూ ప్రకటించనున్నది. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం దృష్ట్యా భారత వృద్ధిరేటుకు కోత పెట్టే వీలుందని సమాచారం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, అభివృద్ధి చెందుతున్న దేశాలపై యుద్ధ ప్రభావం ఏ మేరకు ఉందన్నదానిపై ఐఎంఎఫ్ అంచనా వేస్తున్నది. ఇప్పటికే ఆసియాపై యుద్ధ ప్రభావం కనిపిస్తున్నదని, అధిక ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెరుగుదల, వ్యక్తిగత-సంస్థాగత రుణాలు భారమవడం ఇందుకు కారణాలన్నారు.