హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్)లో యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్(ఏహెచ్‌పీ), కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(సీహెచ్‌పీ) నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు జారీ చేసిన టెండర్‌ను రద్దు చేయాలని రాష్ట్ర విద్యుత్తు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ(టీజీపీఈ జేఏసీ) డిమాండ్ చేసింది. గురువారం జేఏసీ ప్రతినిధులు టీజీ జెన్కో డైరెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వైటీపీఎస్ స్టేజ్-1లోని యూనిట్-1,2, స్టేజ్-2లోని యూనిట్ 3,4ను అతి తక్కువ మందితో నిర్వహిస్తున్నారని, యూనిట్-5లో కూడా ఈ ఏడాది సెప్టెంబర్‌లో కమర్షియల్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నదని జేఏసీ పేర్కొన్నది. ఇలాంటి కీలక విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల సురక్షిత నిర్వహణకు తగినంత సిబ్బంది అవసరమని పేర్కొన్నారు.
సిబ్బంది కొరతతో ఉద్యోగులపై అధిక పనిభారం పడుతున్నదని, ఇది విద్యుత్ కేంద్రాల పనితీరు, నిర్వహణపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే వైటీపీఎస్‌లో ఏహెచ్‌పీ, సీహెచ్‌పీ నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు జారీ చేసిన టెండర్‌ను రద్దు చేసి సంస్థ ప్రయోజనాలను కాపాడాలని కోరారు. జెన్కో ఆవిర్భావం నుంచి కొత్త యూనిట్ల నిర్వహణ ఎప్పుడూ జెన్ కో ఇంజినీర్ల పర్యవేక్షణలోనే సాగుతున్నదని, ఇప్పుడు కీలకమైన ఆపరేషన్, మెయింటెనెన్స్ పనులను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం సంస్థలో ఉన్న సంప్రదాయ పద్ధతులకు విరుద్ధమని పేర్కొన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో టీజీపీఈజేఏసీ చైర్మన్, జీ సాయిబాబు, కన్వీనర్ పీ రత్నాకర్‌రావు, కో-కన్వీనర్ పీబీసీ రెడ్డి జనరల్ సెక్రటరీ ఈ శ్రీధర్, తాజుద్దీన్ బాబా, పవన్, సదానందం, కుమారస్వామి, సుధాకర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన బొగ్గు సరఫరా చేయండి
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)కు నాణ్యమైన బొగ్గు సరఫరా చేసి, ఇటీవల పిలిచిన టెండర్లను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీఈఈ జేఏసీ) చైర్మన్ సీహెచ్ రమేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం విద్యుత్ అకౌంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యోగులకు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సిన పీఆర్సీ ఇప్పటి వరకు ప్రకటించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీ వేసి, త్వరితగతిన అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఈపీఎఫ్, జీపీఎఫ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కో చైర్మన్ పీ.అంజయ్య, కన్వీనర్ ఎన్ శివాజీ, అడ్వైజర్ కొడూరి ప్రకాశ్, కో కన్వీనర్ బీ రాజా రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.