ఆదిలాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్ను ట్రక్కు ఢీ కొట్టడంతో ఓ ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే..జైనథ్ మండలం చెక్పోస్ట్ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు పద్మ మరణించారు. కాగా,వరుసగా మూడు రోజులుగా జరుగుతున్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
జైనథ్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న పద్మ ఈ రోజు ఉదయం ఆదిలాబాద్ నుంచి తన ద్విచక్రవాహనంపై విధులకు హాజరు కావడానికి వెళ్లారు. చెక్ పోస్ట్ వద్ద బారికేడ్లు ఉండడంతో అటువైపు నుంచి వస్తున్న ట్రక్కు టూవీలర్ను ఢీకొంది. దీంతో పద్మ అక్కడికక్కడే మృతి చెందింది.
వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో ఆగ్రహించిన స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. ప్రమాదాలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు. పోలీసులు స్థానికులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపచేశారు.