జీహెచ్ఎంసీ పరిధిలోని బడంగ్‌పేట మున్సిపల్ కార్యాలయంలో అవినీతి అక్రమాల పర్వం కొనసాగుతూనే ఉంది. కోట్లాది రూపాయల నిధుల గోల్ మాల్‌పై ఒకవైపు ఏసీబీ, మరోవైపు విజిలెన్స్ విచారణలు ముమ్మరంగా సాగుతున్నా, కొందరు అధికారులు మాత్రం తమ పంథా మార్చుకోవడం లేదు. ఏసీబీ కన్ను పడినా.. విజిలెన్స్ వేటు వేసినా.. మా లెక మాదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పాత బిల్లుల క్లియరెన్స్ కోసం కాంట్రాక్టర్లతో కుమ్మకై అడ్డదారులు తొకుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ) : బిల్లులు రావాల్సిన కాంట్రాక్టర్లలో 28 మంది స్థానిక నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నేతను కలిసి అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు, సమగ్ర విచారణ జరిపితే అసలుకే టెండర్, పనులు తాలుకా అసలు వివరాల గుట్టు తేలితే బిల్లులు రావడం కష్టమేనని భావించిన సదరు కాంట్రాక్టర్లు పైరవీలకు తెరలేపారు. అధికారులు మాత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ విషయంలో ప్రత్యేక ఫార్మట్ ఇచ్చారని, టెండర్ ఐడీ, డేటా, పనులు వివరాలు, ఏ స్టేజీలో ఎంత చేశారు? ఇలా దాదాపు 18 కాలమ్స్‌తో కూడిన వివరాలను పూర్తిగా తీసుకుని బిల్లులు రికార్డు చేస్తున్నట్లు చెబుతున్నారు.
మొత్తంగా ఈ వారంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి బిల్లుల చెల్లింపుల ప్రతిపాదనలు చేరనున్న తరుణంలో గుట్టు చప్పుడు కాకుండా కొందరు కాంట్రాక్టర్లతో కలిసి భారీ ఎత్తున ఆక్రమాలకు పాల్పడుతున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది. బడంగ్ పేటలో సుమారు రూ. 122 కోట్ల పనుల్లో అక్రమాలు జరిగాయన్న విజిలెన్స్ నివేదిక ఆధారంగా జీహెచ్ఎంసీ కమిషనర్ 10 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. విలీనానికి ముందు జరిగిన పనుల్లో రికార్డుల తారుమారు, కమీషన్ల పంపకాలపై లోతైన విచారణ జరపడం, మరోవైపు ఏసీబీ అధికారులు ఒక్కొ అధికారికి పిలిచి విచారణ చేస్తున్నారు. ఈ సమయంలోనే రాష్ట్ర విజిలెన్స్ విభాగం సైతం అన్ని రికార్డులను జిరాక్స్ రూపంలో తీసుకువెళ్లారు.
ఈ నేపథ్యంలోనే అదృశ్యమైన 46 కీలక ఫైళ్లు ఓ కాంట్రాక్టర్ బంధువు ఇంట్లో ప్రత్యక్షం కావడం, ఇప్పుడు ఆ ఫైళ్ల వెనుక ఉన్న అసలు తిమింగలాలను కాపాడేందుకు తెరవెనుక భారీ పైరవీలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. మరికొందరు ఈ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని మరికొన్ని పాత బిల్లులను వెనకదారిలో పాస్ చేయించుకునేందుకు కొందరు కాంట్రాక్టర్లు పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది. ప్రధానంగా కార్యాలయంలో ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి అయిన కంప్యూటర్ ఆపరేటర్‌ను మధ్య వర్తిగా పెట్టుకుని ఈ మంత్రాంగం నడిపిస్తున్నారన్న ప్రచారం ఉంది.
ప్రక్షాళనలో భాగంగా అటెండర్ నుంచి ఉన్నతాధికారుల వరకు సమూలంగా మార్పులు చేసిన అధికారులు…ఓ ఆపరేటర్‌ను మాత్రం తిరిగి అదే స్థానంలో విధులు కొనసాగిస్తుండడం, గతంలో మాదిరిగానే ఇంజినీరింగ్ వ్యవహారాలను తన చేతుల్లో పెట్టడమే ఇందుకు నిదర్శమని చెబుతున్నారు. సదరు ఆపరేటర్‌కు వరుసగా బావ కూడా కాంట్రాక్టర్ కావడం, అధికారులకు, కాంట్రాక్టర్ల మధ్య వారధిగా ఉంటూ పాత బిల్లుల క్లియరెన్స్, విచారణలో ఏ అంశాలు బయటకు రాకుండా వ్యవహారాలను చక్కబెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా లక్ష రూపాయల లోపు ఉన్న దాదాపు 1200 ఫైల్స్ జోలికి వెళ్లకుండా రూ.కోట్లలో ఉన్న టెండర్ తాలుకా బిల్లులు చెల్లింపులపై జీహెచ్ఎంసీ కమిషనర్ జోక్యం చేసుకుని ఆక్రమార్కుల భరతం పట్టాలని కోరుతున్నారు.