నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 30 : ఇతరులకు అనుమానం కలుగకుండా పవిత్రమైన అయ్యప్పమాల ధరించినట్లు నటిస్తూ గురుస్వామి ఇంటికే కన్నం వేశాడు ఓ పాత నేరస్తుడు. నగరంలోని రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 28వ తేదీన జరిగిన దొంగతనం కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సౌత్ రూరల్ సీఐ నరేశ్‌తో కలిసి శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ నిందితుడి వివరాలను వెల్లడించారు. నగరంలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన పాత యువకుడు బచ్చల నాగరాజు.. ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తూ నగర శివారులోని గూపన్పల్లి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవలే అయ్యప్ప మాల ధరించి స్థానిక భక్తులతో కలిసి అదే గ్రామానికి చెందిన గురుస్వామి చిన్నబోయిన సత్యనారాయణ ఇంట్లో ఉంటున్నాడు. 28వ తేదీన సత్యనారాయణ.. తన ఇంట్లో ఉన్న బీరువాను తెరిచి చూడగా 8.5 తులాల నగలు, రూ. లక్ష నగదు కనిపించలేదు. వెంటనే రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని సీఐ నరేశ్ ఆధ్వర్యంలో ఏఎస్సై పరమేశ్వర్, సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. గూపన్పల్లి పరిధిలో శుక్రవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి 8 తులాల ఆభరణాలు, రూ. లక్ష నగదును రికవరీ చేశామని ఏసీపీ వెల్లడించారు. నిందితుడు పాత నేరస్థుడని, గతంలోనూ పలు చోరీలు చేసినట్లు వివరించారు. 24 గంటల వ్యవధిలో కేసును ఛేదించిన సీఐ నరేశ్, ఏఎస్సై పరమేశ్వర్, సిబ్బందిని అభినందించారు.