హైదరాబాద్, మే 30(నమస్తే తెలంగా ణ): అధికారుల కార్యకలాపాల కోసం అద్దెకు తీసుకొన్న వాహనాల బిల్లులు చెల్లించకపోవడంతో వాటి యజమానులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యా రు. ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసు కోకపోతే.. వాహనాలు బంద్ పెడుతామని హెచ్చరిస్తున్నారు. ఎప్పుడో కేసీఆర్ హ యాంలో 2017లో నెలకు రూ.34 వేల చొప్పున వేతనం చెల్లించేవారని, ఇప్పటికీ అవే కొనసాగుతున్నాయని చెప్తున్నారు.
అప్పటినుంచి పెట్రోల్, డీజిల్ ధరలు అనేక పర్యాయాలు భారీగా పెరిగిన నేపథ్యంలో రూ.34 వేలు గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు. 2017లో లీటర్ డీజిల్ ధర రూ.64లు ఉండేదని, ప్రస్తుతం రూ.110కు పెరిగిందని గుర్తుచేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయని అంటున్నారు. తక్షణం తమ వేతనం రూ.43 వేలకు పెంచడంతో పాటు పెండింగ్ బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.