సూర్యాపేట, మే 30 : తెలంగాణ రైతుల పాలిట ఉరితాడుగా మారనున్న మూడో డిస్కం ఏర్పాటును బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఈ విషయంలో రైతుల పక్షాన ముందుండి పోరాటం చేస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం సూర్యాపేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్తు, మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు తదితర పథకాలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. మూడో డిస్కం తెస్తామని, మోటార్లకు మీటర్లు పెట్టక తప్పదని చెప్పడం రైతులను నిలువునా మోసగించడమేనన్నారు. రైతులు కరెంటు ఎంత వాడుతున్నారో తెలియడం లేదని, అది తెలియాలంటే మోటార్లకు మీటర్లు పెడతామని చెప్పడం సిగ్గు చేటన్నారు.
పదేళ్ల పాటు కేసీఆర్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి 24 గంటల పాటు రైతులకు ఉచిత విద్యుత్తు అందజేశారని, మోటార్లకు మీటర్లు పెడితే రూ.30వేల కోట్ల సబ్సిడీ ఇస్తామన్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ హామీ ఇచ్చినా నాటి ప్రభుత్వం లొంగలేదన్నారు. నా మెడ మీద తల ఉన్నంత వరకు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని కేసీఆర్ తిరస్కరించారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోని రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేందుకు యత్నిస్తూ రూ.10 నుంచి 15వేల కోట్ల వ్యాపారాన్ని అదానీ, అంబానీలకు అప్పగిస్తూ కమీషన్ల కోసం కక్కుర్తి పడుతూ రైతు మెడకు ఉరితాడు బిగిస్తోందన్నారు. మూడో డిస్కం ఏర్పాటును బీఆర్ఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తుందని, రైతుల పక్షాన ముందుండి పోరాడుతుందన్నారు.
అలాగే ధాన్యం కొనుగోళ్ల విషయంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా 55 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసి వారంలో కొనుగోలు కేంద్రాలు మూసి వేస్తామని చెప్పడం సరి కాదన్నారు. 2023లో కేసీఆర్ 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇంటికి వెళ్లి డబ్బులు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా కొత్త ఓటర్లను నమోదు చేయించడంతో పాటు దొంగ ఓట్లను ఏరివేయాలని, చనిపోయిన వారి ఓట్లను తొలగించి, జాబితాలో తప్పుల్లేకుండా నిజమైన ఓటర్లు ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఉప్పల ఆనంద్ పాల్గొన్నారు.