బంజారాహిల్స్, మార్చి 29: లాకర్లో దాచుకొన్న వస్తువులను పరిశీలించేందుకు స్ట్రాంగ్‌రూమ్‌లోకి వెళ్లిన ఓ వృద్ధుడు బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 18 గంటలపాటు అక్కడే చిక్కుకుపోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 67లో నివసిస్తున్న వీ కృష్ణారెడ్డి (85) సోమవారం సాయంత్రం 4.30 సమయంలో యూనియన్ బ్యాంకు స్ట్రాంగ్‌రూమ్‌లోకి వెళ్లారు. దీన్ని గుర్తించకుండా బ్యాంకు సిబ్బంది తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోవడంతో ఆయన రాత్రంతా స్ట్రాంగ్‌రూమ్‌లోనే ఉండిపోయారు. వెంటిలేషన్ లేక తెల్లవారుజామున సృహ తప్పారు. కృష్ణారెడ్డి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆయన కుమారుడు సోమవారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీసీటీవీ ఫుటేజీల్లో స్పష్టత రాకపోవడంతో ఎస్ఐ చంద్రశేఖర్ మంగళవారం ఉదయం ఆ బ్యాంకుకు వెళ్లి పరిశీలించారు. స్ట్రాంగ్‌రూమ్‌లో పడివున్న కృష్ణారెడ్డికి ప్రథమ చికిత్స అందించి, దవాఖానకు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.