పౌష్టికాహారం మనుషులకే కాదు జంతువులకూ అవసరమే. మనుషుల్లో ఉండే రకరకాల ఫుడ్ అలర్జీలు జంతువుల్లోనూ ఉంటాయి. అందువల్ల పెంపుడు జంతువులకు పెట్టే ఆహారం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వాటికి సరిపోయే ఆహారంతోపాటు కావలసిన పోషక విలువలు అందించే కొన్ని రకాల సూపర్ ఫుడ్స్ ఇవి..
బ్లూబెరీస్: వీటిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెదడు కణాలను ఉత్తేజపరుస్తాయి.
క్యారెట్స్: రోగనిరోధక శక్తిని పెంచే బీటాకెరోటిన్ పుష్కలంగా లభించే ఆహారం క్యారెట్. ఇది జంతువుల ఊలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. కంటి సమస్యలనూ తగ్గిస్తుంది. పచ్చి క్యారెట్లను నమలడం వల్ల వాటి చిగుళ్లు గట్టిపడతాయి.
చియాసీడ్స్: చియా గింజలు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు దోహదపడతాయి. వీటిలోని ఐరన్, విటమిన్ బి, పీచు పదార్థాలు, ప్రొటీన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఒమెగా-3 ఫ్యాటీయాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. అరగంటపాటు నీళ్లలో నానబెట్టిన చియా గింజలను పెంపుడు జంతువులకు ఇచ్చే ఆహారంలో కలిపి ఇవ్వొచ్చు.
ఆకుకూరలు: ఆకుకూరలు ఎక్కువగా తినే కుక్కల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ అని అధ్యయనాల్లో తేలింది. కాలే, పాలకూర వంటివాటిని రోజూవారీ ఆహారంతోపాటు అందించాలి. వీటిలో పుష్కలంగా ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, ప్రొటీన్స్, క్యాల్షియం, ఫైబర్, విటమిన్ ఎ, సి, కె జంతువుల పూర్తి ఆరోగ్యానికి దోహదపడతాయి.