
రామచంద్రాపురం, డిసెంబర్ 10 : మోదీ సర్కార్ విధానాలు కార్మిక, రైతాంగానికి తీరని నష్టం చేస్తున్నాయని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆర్సీపురం డివిజన్లోని ధర్మపూరి గార్డెన్స్‌లో శుక్రవారం సీపీఐఎం జిల్లా ద్వితీయ మహాసభలు ఘనంగా జరిగాయి. మహాసభలకు జిల్లాలోని సీపీఐ(ఎం)నాయకులు, కార్యకర్తలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజానాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఘట్టం అందరినీ ఆకట్టుకుంది. మహాసభలకు తమ్మినేని వీరభద్రం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభు త్వం రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయడంలో తాత్సరం చేస్తుందని మండిపడ్డారు. కార్మికులు, మోదీ సర్కారు తీరుకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి పోరాడాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. రైతుల విషయంలో సీఎం కేసీఆర్ కేంద్రంపై మోగించిన జంగ్ సైరన్ ఉద్యమానికి నాంది పలుకుతుందని, దీనికి సీపీఐ(ఎం) మద్దతు ఇస్తుందన్నారు. దేశ సంపదను కేంద్రం అమ్ముకుంటున్నదని, దేశభక్తి పేరుతో బీజేపీ ప్రజలను మోసం చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.