బెంగళూరు, ఆగస్టు 26: దేశభక్తి, జాతీయవాదంపై గొప్పగొప్ప మాటలు మాట్లాడే బీజేపీ.. చేతల్లో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల కుటుంబాలకు ఆర్థికంగా సాయం అందించడాన్ని భారంగా చూస్తున్నది.
కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం అమర జవాన్ల విషయంలో తాజాగా తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అమరుల కుటుంబాలకు ఇకపై ఎటువంటి ఎక్స్‌గ్రేషియో, ఇతర సదుపాయాలు ఇవ్వబోమని బొమ్మై సర్కారు ప్రకటించింది.
కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటున్న సర్కార్.. అది ఏ క్యాడర్ ఉద్యోగమనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం బొమ్మై ప్రసంగిస్తూ.. అమరుల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చేసిన ప్రకటన ఉత్తిదే అని దీంతో తేలిపోయింది.
ప్రభుత్వ నిర్ణయంపై సైనిక్ వెల్ఫేర్ అండ్ రీసెటిల్మెంట్ విభాగం మాజీ డైరెక్టర్ బ్రిగేడియర్ రవి మునిస్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు. అమర వీరుల కుటుంబాలకు దేశంలోని అనేక రాష్ర్టాలు భూమి, ఎక్స్‌గ్రేషియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇస్తున్నాయని పేర్కొన్నారు.
అమరుల కుటుంబాలపై కర్ణాటక ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని మండిపడ్డారు. ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన.. వారికి మంచి చేసినట్టు కాదని, ఇతర సదుపాయాలు కల్పించకపోవడం దారుణమని అన్నారు. రూల్స్ ప్రకారం అమరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల సాగు భూమి, 8 ఎకరాల మెట్ట భూమి ఇవ్వాల్సిఉన్నదని, అయితే ప్రభుత్వం దాని జోలికి మాత్రం వెళ్లడం లేదని విమర్శించారు.
ఈ సదుపాయాల కోసం అమరుల కుటుంబసభ్యులు 20 ఏండ్ల తర్వాత కూడా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొన్నదని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల కుటుంబాల విషయంలో వ్యవహరించే తీరు ఇదేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇస్తామని చెబుతున్న ఉద్యోగం ఎటువంటిదో తెలుసుకోవాలని అనుకుంటున్నానని మునిస్వామి అన్నారు. ‘ఓట్ల కోసం ఉచితాలు ఇచ్చేందుకు ప్రభుత్వాలకు నిధులు ఉన్నప్పుడు.. అమరుల కుటుంబాలకు గౌరవప్రదమైన ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేరా’ అని ప్రశ్నించారు.
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): అమరవీరుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా, ఇతర సదుపాయాలను నిలిపివేసి, ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కల్పిస్తామని కర్ణాటక క్యాబినెట్ నిర్ణయించడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు స్పందించారు. జాతీయవాదం గురించి గొప్పగా మాట్లాడే బీజేపీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అవమానకరమని ట్వీట్ చేశారు.
సాయుధ దళాల్లో పనిచేసిన సైనికులను మనం గౌరవించుకోవాలి కానీ ఆర్థికభారంగా పరిగణించొద్దు అని హితవు చెప్పారు. ఈ నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం ఉప సంహరించుకుంటుందని ఆశిస్తున్నట్టు ట్వీట్ చేశారు. కర్ణాటక క్యాబినెట్ నిర్ణయంపై దేశవ్యాప్తంగా మాజీ సైనికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్ చేశారు.