న్యూఢిల్లీ: విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థినిలు హిజాబ్ ధరించడంపై అనవసర చర్చ జరుగుతున్నదని కర్ణాటకలోని రామకృష్ణ ఆశ్రమానికి చెందిన యోగి భవేశానంద్ చెప్పారు. హిజాబ్ వివాదం సమాజానికి మంచిది కాదన్నా రు. హిజాబ్‌పై ప్రస్తుతం జరుగుతున్న చర్చ, రాద్ధాంతాన్ని చూస్తుంటే మనసుకు బాధకలుగుతున్నదని వెల్లడించారు.
హిజాబ్ ధరించడం తమ హక్కు అని, విద్యా సంస్థల్లో కూడా అనుమతించాలని కోరుతూ ముస్లిం యువతులు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వారి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది దేవాదత్ కామత్‌ను కొందరు టార్గెట్ చేసుకున్నారని విమర్శించారు. దేవాదత్ ఓ న్యాయవాది అని, తన ైక్లెయింట్కు న్యాయం జరిగేలా చూడటం ఆయన విధి అని భవేశానంద్ చెప్పారు. ఆయన హిందూ వ్యతిరేకి అన్నట్టు సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం తగదని సూచించారు. ఈ వివాదంలోకి ఓ న్యాయవాదిని కూడా లాగడం చూస్తుంటే బాధేస్తున్నదని వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌ను తాకిన హిజాబ్ వివాదం
మధ్యప్రదేశ్‌లోని ఓ కాలేజీకి పీజీ విద్యార్థిని రుక్సానాఖాన్ హిజాబ్ ధరించి రావడంపై ప్రిన్సిపల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ హిజాబ్ ధరించి కాలేజీకి రాబోనంటూ ఓ లేఖ రాయించుకున్నాడు. ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ హిజాబ్ ధరించే ఓ యువతి ఏదో ఒక రోజు ఈ దేశానికి ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.