రవీంద్రభారతి : ఎన్నికల సందర్భంగా విద్యార్థి, నిరుద్యోగ యువతికు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ( Youth Declaration ) పేరుతో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ యువజన సంఘం ( Telangana Youth Association) డిమాండ్ చేసింది.
గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు మాట్లాడారు. కాంగ్రెస్ ( Congress ) పార్టీ అధికారంలోకి రాగానే హామీలను ఆటకెక్కించారని, హామీలను అమలు చేయాలని కోరితే అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని విమర్శించారు. విద్యార్థి, నిరుద్యోగులు గొంతెమ్మ కోరికలు ఏమీ కోరడంలేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నామన్నారు.
అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ఇప్పటి వరకు అమలు చేయడంలేదన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి, ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో కొన్ని అడఫా దడపా చిన్ని నోటిఫికేషన్లు, గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాబ్ ఆర్డర్లు మాత్రమే ఇచ్చారని దుయ్యబట్టారు.
లక్షల మంది నిరుద్యోగ యువత నుంచి రాజీవ్ యువ వికాసం పేరుతో తీసుకున్న దరఖాస్తులను చెత్తకుప్పలో వేసారని ఆరోపించారు. వెంటనే నిరుద్యోగ భృతిని విడుదల చేయాలని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకి అవగాహన కల్పించి, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలో విద్యా దోపిడీ అరికట్టాలని, పెండింగ్ ఫీజురియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్కే రహిమత్ పాషా, భాషిపంగు సునీల్, సంతోష్‌రెడ్డి, సోమ శ్రీనివాస్, విప్లవ్‌కుమార్, పుల్లూరి రాజు, రాజ్‌కుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.