హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ పంచాయతీ వరకు కార్యనిర్వహణలో వెన్నెముకగా పని చేస్తున్న వారి సేవలు గుర్తింపునకు నోచుకోవడంలేదు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై హామీలు గుప్పించింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటకెక్కించింది. రాష్ట్రంలోని 42 ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లో దాదాపు రెండు లక్షల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగ భద్రత లేక, సరైన వేతనం అందక, ప్రభుత్వం నుంచి భరోసా లభించక బతుకులు వెళ్లదీస్తున్నారు.
ప్రభుత్వానికి, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మధ్య దళారీ వ్యవస్థ లాంటి ఏజెన్సీల ద్వారా జీతాలు చెల్లిస్తున్నారు. వీరు చాలా రకాలుగా అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు కొల్లగొడుతున్నారని పలు సందర్భాల్లో నిగ్గుతేలింది. ఇలాంటి మధ్యవర్తి సంస్థలను రద్దు చేసి, ప్రభుత్వం ద్వారా జీతాలు చెల్లిస్తే తమకు న్యాయం జరుగుతుందని ఔట్సోర్స్ ఉద్యోగులు కోరుతున్నారు. ఇలా చేస్తే ఔట్సోర్స్ ఉద్యోగులకు మేలు జరగడంతోపాటు ప్రభుత్వానికి వేల కోట్ల ఆర్థికభారం తగ్గుతుందని చెప్తున్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను నిర్వహిస్తున్నారని, ఏజెన్సీలను ప్రోత్సహిస్తూ జేబులు నింపడం కోసమే ప్రభుత్వంలోని కొందరు పెద్దలు మొగ్గుచూపుతున్నారని, అందుకే అక్రమాల పట్ల చోద్యం చూస్తున్నారని ఉద్యోగ సంఘాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సచివాలయంలో 300 మంది, అసెంబ్లీలో 250 మంది ఔట్సోర్స్ ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. 33 కలెక్టరేట్లు, ఉన్నతాధికారుల కార్యాలయాల పరిధిలో ప్రతి జిల్లాకు దాదాపు 4,800 మంది పనిచేస్తున్నారు. ఒక్కోసారి నెలల తరబడి జీతాల కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూడాల్సిన దుస్థితిని అనుభవిస్తున్నారు. క్రమబద్దీకరణ కోసం చూస్తూ చూస్తూ… ఉద్యోగ విరమణ దశకు వచ్చిన వాళ్లు వేలల్లో ఉన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని గతంలోనే సుప్రీంకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా తీర్పు వెలువరించింది.
మూడేండ్లకుపైగా సేవలు అందించిన వారికి శాశ్వత ఉద్యోగులతో సమానంగా జీతం, ఇతర ప్రయోజనాలు కల్పించాలని పేర్కొన్నది. అవసరమైన చోట శాశ్వత పోస్టులను సృష్టించి.. వీరిని రెగ్యులరైజ్ చేయడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపింది. ఈ తీర్పు అన్ని రాష్ర్టాలకు వర్తిస్తుందని వెల్లడించింది. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలని ఔట్స్సోర్స్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేస్తున్నది.
ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 15-20 ఏండ్లుగా పనిచేస్తున్న ఔట్సోర్స్ ఉద్యోగులు అందరినీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ప్రతినెలా ఒకటో తారీఖున వేతనాలు చెల్లించాలి. విధి నిర్వహణలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందించి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.
-పుల్లగుర్ల రాజిరెడ్డి, తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు