జకర్తా: ఆసియా హాకీ కప్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ తొలి పోరులోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇండోనేషియా వేదికగా మే 23 నుంచి ప్రారంభం కానున్న టోర్నీ షెడ్యూల్‌ను ఆసియా హాకీ సమాఖ్య (ఏహెచ్ఎఫ్) బుధవారం ప్రకటించింది. పూల్ ‘ఏ’లో భారత్, జపాన్, పాకిస్థాన్, ఇండోనేషియా ఉండగా.. పూల్ ‘బీ’లో మలేషియా, కొరియా, ఒమన్, బంగ్లాదేశ్ పోటీ పడుతున్నాయి. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత భారత్ మొదటి రోజే మే 23న పాకిస్థాన్‌తో తలపడనుంది.
అనంతరం 24న రెండో మ్యాచ్ జపాన్‌తో, ఆఖరి పోరు 26న ఆతిథ్య జట్టు ఇండోనేషియాతో టీమ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఆసియా కప్‌ను భారత్, పాక్ మూడుసార్లు చేజిక్కించుకోగా.. ఉత్తర కొరియా అత్యధికంగా నాలుగు సార్లు సొంతం చేసుకుంది. సూపర్ 4 పూల్ ఫార్మాట్ విధానంలో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్లు తర్వాతి దశకు దూసుకెళ్లనుండగా.. జూన్ 1న ఫైనల్ జరుగనుంది.