భీమదేవరపల్లి మండలంలో మూలకు విసిరేసినట్లుండే గట్ల నర్సింగాపూర్ గ్రామం ఒకప్పుడు అక్షరాస్యతలో వెనుకబడి ఉండేది. అనేక మంది యువతీ యువకులు ఉన్నత చదువులు చదవాలనే తమ ఆకాంక్షలకు గ్రామంలో ఉన్న తెలుగు మాధ్యమం బడిలోనే తెర పడేది. అలాంటి గ్రామంలో 2009లో విద్యా విప్లవం మొదలైంది. కేవలం నగరాల్లోనే ఉండే కార్పొరేట్ స్థాయి స్కూలు ఆ ఊరికి వరంలా వచ్చింది. గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, కావేరీ సీడ్స్ అధినేత గుండవరపు భాస్కర్ రావు తన స్వగ్రామానికి ఏదైనా చేయాలనే తలంపుతో అధునాతన రీతిలో ప్రాథమిక పాఠశాలతో పాటు హైస్కూల్ భవనం కూడా నిర్మించి అందులో ప్రభుత్వ ఉపాధ్యాయులకు తోడు సొంత ఖర్చులతో ప్రైవేట్ ఉపాధ్యాయులను నియమించి నాణ్యమైన విద్యా బోధనకు శ్రీకారం చుట్టడంతో ఇప్పుడు గ్రామ విద్యా స్వరూపమే మారిపోయింది.
– హనుమకొండ సబర్బన్, మార్చి 4
గ్రామంలో ఏ ఇంట్లో చూసినా ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులున్నారు. కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా, ఇతర ఉన్నతోద్యోగులుగా స్థిరపడ్డారు. ఇందుకు గుండవరపు భాస్కర్రావు ఏర్పాటు చేసిన ఇంగ్లిష్ మీడియం పాఠశాలే కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. మాతృభాష తెలుగుతో పాటు ఇంగ్లిష్ వచ్చినప్పుడే ఇతర రాష్ర్టాల్లోగాని, దేశాల్లో గాని మనోళ్లు రాణించగలుగుతారని స్పష్టం చేస్తున్నారు. గ్రామంలో 2009లో గుండవరపు సత్యవతి, శ్రీనివాస రావు మెమోరియల్ పాఠశాలను భాస్కర్ రావు ఏర్పాటు చేశారు. రూ.4కోట్లతో హైస్కూల్, ప్రాథమిక స్కూల్కు రెండు అధునాతన భవనాలు కట్టించారు. రూ.60 లక్షలతో రెండు డైనింగ్ హాళ్లు, లైబ్రరీతో పాటు ఉచితంగానే విద్యార్థులకు ఇంగ్లిష్ డిక్షనరీలు పంపిణీ చేశారు. విద్యార్థులకు బోధించేందుకు తొమ్మిది మంది ప్రభుత్వ ఉపాధ్యాయులుండగా భాస్కర్ రావు తన సొంత ఖర్చుతో మరో 35 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రతి నెలా రూ.ఆరున్నర లక్షల వేతనాలతో నియమించారు. పాఠశాల పారిశుధ్యం కోసం నలుగురిని నియమించారు. ప్రతి తరగతిలో విద్యా బోధనను పర్యవేక్షించేందుకు మరొకరిని నియమించారు. విద్యార్థులకు టై, బెల్టు, పుస్తకాలు, యూనిఫాం, స్ఫోర్ట్స్ మెటీరియల్ కూడా ఉచితంగానే అందిస్తున్నారు. విద్యార్థుల కోసం అధునాతన ప్రొజెక్టర్ రూం, కంప్యూటర్లు సైతం ఏర్పాటు చేశారు. స్కూల్కు వచ్చేందుకు రెండు బస్సులు వేశారు. ప్రతి తరగతి గదిలో డబుల్ డెస్క్ బల్లలు కూడా వేశారు. ఒకప్పుడు సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు ఇప్పుడు స్వగ్రామంలోనే అత్యంత నాణ్యమైన విద్య అందుతున్నది. దీంతో ఈ పాఠశాలలో ఇప్పుడు మొత్తం 870 మంది పిల్లలు చదువుకుంటున్నారు. గ్రామంలో ఏ ఇంట్లో చూసినా పిల్లలు చకచకా ఆంగ్లంలో మాట్లాడుతూ అబ్బుర పరుస్తున్నారు.