ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో ఈటీవీ విన్ సత్తా చాటింది. ఈ సంస్థ నిర్మించిన చిత్రాలు ఏడు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకున్నాయి. రూరల్ తెలంగాణ ప్రేమకథ ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, ఉత్తమ బాలల చిత్రంగా ‘అనగనగా’, ఉత్తమ ద్వితీయ లఘుచిత్రంగా ‘మౌనమే నీ భాష’, ఉత్తమ దర్శకుడిగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు సాయిలు కంపాటి, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా ‘లిటిల్ హార్ట్స్’ చిత్ర దర్శకుడు సాయిమార్తాండ్, బెస్ట్ మేల్ యాక్టర్‌గా ‘రాజు వెడ్స్ రాంబాయి’లో అద్భుత నటన కనబరచిన చైతు జొన్నలగడ్డ, ఉత్తమ గాయకుడిగా అనురాగ్ కులకర్ణి(రాజు వెడ్స్ రాంబాయి) అవార్డులను గెలుచుకున్నారు.
ఇన్ని పురస్కారాలు ఈటీవీ విన్కి వరించడం పట్ల సదరు సంస్థ ఆనందాన్ని వ్యక్తంచేస్తూ సోమవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ని నిర్వహించింది. ఆర్.నారాయణమూర్తి, తమ్మారెడ్డి భరద్వాజ్, ఈటీవీ విన్ ప్రతినిథులు సాయికృష్ణ, నితిన్ ఈ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు అభినందనలు అందించారు. ఈ సందర్భంగా వారంతా ఈటీవీ విన్ విజయాలను కొనియాడారు. అవార్డులు గెలుచుకున్న చిత్రబృందాలన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.