హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ): విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చి తీరాల్సిందేనని వివిధ రాజకీయ పార్టీలు కేంద్రాన్ని డిమాండ్ చేశా యి. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ హక్కు అని స్పష్టంచేశాయి. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతోపాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్తోపాటు సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, కాంగ్రెస్, టీటీడీపీ, టీఎమ్మార్పీఎస్ నాయకులు, రైల్వే రిటైర్డ్ ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు.
రైల్వే కోచ్‌తోపాటు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, జాతీయ రహదారులు, రైల్వేలైన్ హామీలను అమలు చేయాలని ఆయా పార్టీల నేతలు డిమాండ్ చేశారు. పార్లమెంటులో మంగళవారం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఇందుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకుండా కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని మండిపడ్డారు. మహాధర్నాలో రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీతోపాటు వరంగల్‌లో రైల్వే డివిజన్ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. విభజనచట్టంలో పేర్కొ న్న విధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, జాతీయ రహదారులు, రైల్వేలైన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాజీపేట-హుజూరాబాద్-కరీంనగర్ రైల్వేలైను పనులను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తిచేశారు. రైల్వే లైను పనులు, భూసేకరణ తదితర అవసరాలకు అయ్యే నిధులను రైల్వే శాఖ వెచ్చించాలని డిమాండ్‌చేశారు. ఇంతకాలం రైల్వే లైన్లు వేయ డం వంటి కష్టతర పనులకు ఎస్సీ, ఎస్టీ సిబ్బందిని వాడుకొన్న రైల్వేశాఖ ఇప్పుడు వారి అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు కేంద్ర ప్రభుత్వానికి మంచిది కాదని హితవు చెప్పారు.
బీజేపీ నేతలను వరంగల్‌లో అడుగు పెట్టనివ్వం
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకుంటే బీజేపీ నాయకులను వరంగల్ జిల్లాలో అడుగు పెట్టనిచ్చేది లేదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ హెచ్చరించారు. అనంతరం రైల్వే అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు యాదవ్రెడ్డి, సుందర్రాజ్, వరంగల్ నగర కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ చింతల యాదగిరి, కాంగ్రెస్ నాయకుడు జంగా రాఘవరెడ్డి, సీపీఐ నాయకులు మేకల రవి, తిరుపతి, భిక్షపతి, సీపీఎం నాయకులు చక్కయ్య, న్యూడెమోక్రసీ నాయకులు గోవర్ధన్, నున్నా అప్పారావు, టీ ఎమ్మార్పీఎస్ నాయకులు భిక్షపతి, రవి, రైల్వే రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మహాధర్నా సందర్భంగా రైల్వే నిలయం వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి.