మేడ్చల్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రైతులను అన్యాయానికి గురిచేస్తున్న బీజేపీ తీరును ఎండగడతామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామన్నారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. కేంద్ర దమననీతిని ప్రతిఒక్కరూ గమనిస్తున్నారని.. రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతామన్నారు. బీజేపీ నాయకులు గ్రామాల్లో తిరగనివ్వని పరిస్థితి రావడం ఖాయమన్నారు.
జిల్లావ్యాప్తంగా నిరసనలు..
బీజేపీ తీరుపై ఈ నెల 20న మేడ్చల్ జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. 61 గ్రామాల్లోని రైతులతో కలిసి బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతామన్నారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఊరేగింపులు, చావుడప్పులు వినిపించి ఈ సెగ ఢిల్లీకి తగిలేలా చూస్తామన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో భారీగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు.