హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ) : అదొక సెంట్రల్ జైలు..అక్కడ ఉండే ఖైదీలు కేవలం 14మంది మాత్రమే. ఆ 14మందికి కాపాలా ఎంతమందో తెలుసా? ఒక జైలు సూపరింటెండెంట్, ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లు, ఒక జైలర్, ఇద్దరు అసిస్టెంట్ డిప్యూటీ జైలర్లు, ఒక డాక్టర్, ఆరుగురు హెడ్ వార్డర్లు, 40మంది వార్డర్లు. మొత్తం కలిపి సుమారు 53మంది. వారందరికీ కలిపి వేతనం ఎంతో తెలుసా? అక్షరాల కోటిన్నర రూపాయలు. ఇంతకీ అది ఏ జైలంటే.. వరంగల్ సెంట్రల్ జైల్. అయితే ఇటీవల ప్రభుత్వానికి క్షమాభిక్ష పెట్టుకున్న ఖైదీల్లో ఈ జైలు నుంచి సుమారు 10మంది వరకూ ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఆ ఫైల్ ఇప్పుడు ముఖ్యమంత్రి వద్ద పెండింగ్లో ఉంది. ఖైదీల విడుదల ఫైలుపై సీఎం సంతకం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా విడుదలకు అర్హత ఉన్న ఖైదీల్లో భాగంగా వరంగల్ జైలు నుంచి 10మంది విడుదల కానున్నారు. వారు విడుదలైతే ఇక అక్కడ ఉండేది నలుగురే. వారి కోసం ప్రతినెలా కోటిన్నర ఖర్చు చేయడమే గాక ఏకంగా జైలు సూపరింటెండెంట్ సహా ఆ నలుగురికి 53మంది అధికారులను కాపలా ఉంచాలి.
జైళ్ల శాఖలో బదిలీలు, పోస్టింగ్లు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు. కాంగ్రెస్ హయాంలో ఎంతమంది డీజీలు వచ్చినా ఆ శాఖ స్వరూపం మార్చడం లో విఫలమవుతున్నారని విమర్శిస్తున్నారు. డీజీగా ఉన్న సౌమ్యామిశ్రా కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఎందుకంటే ఈ ఏడాది ఏప్రిల్ 21న విడుదల చేసిన జీవోలో 2026 జనవరి 1 నాటికి రాష్ట్రవ్యాప్తంగా మూడేండ్లు ఒకే చోట పనిచేసిన వారిని బదిలీ చేయాలని, నాలుగేండ్లు ఒకేచోట ఉన్నవారిని తప్పనిసరిగా బదిలీ చేయాల్సిందేనని జీవో 38లో స్పష్టంగా ఉంది.
అయితే, నేటికీ ట్రాన్స్ఫర్ లిస్టును బహిర్గతం చేయలేదు. ఆ జీవో ప్రకారం మే 1 నుంచి 31లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నా సౌమ్యామిశ్రా అలసత్వం ప్రదర్శిస్తున్నారని వెరసి ఎక్కువ మంది ఖైదీలున్న నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ వంటి జైళ్లలో నేటికీ ఇన్చార్జులతోనే నడిపిస్తున్నారని చెబుతున్నారు. సూపరింటిండెంట్ హోదా ఉన్న పలువురు ఒకేచోట ఏండ్ల తరబడి చేస్తుంటే మరికొందరు లూప్లైన్లలోనే మగ్గిపోతున్నారు.
ఇన్చార్జుల నియామకానికి కూడా కొందరు అధికారులు రూ.లక్షలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పోస్టుకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ ముట్టజెప్పాలనే నిబంధనలు కూడా పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పూర్తిస్థాయి అధికారులు లేక జైళ్లశాఖ అక్రమాలకు నిలయంగా మారుతున్నదని కొందరు నిజాయితీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. హోం శాఖ ఆధ్వర్యంలో ఉన్న జైళ్ల శాఖపై సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డి సైతం పట్టుకోల్పోవడంతో అధికారుల ఇష్టారాజ్యం నడుస్తున్నది. సోమవారం విద్యాశాఖలో బదిలీల గురించి గొప్పగా మాట్లాడిన సీఎం.. తాను హోం మంత్రిగా ఉన్న జైళ్ల శాఖపై కనీసం రివ్యూ చేయకపోవడంపై మండిపడుతున్నారు.