Arteries | న్యూయార్క్, ఏప్రిల్ 16 : హృదయానికి ప్రత్యామ్నాయంలా పనిచేసే ఓ అవయవాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. యార్టా (బృహద్ధమని లేదా మహాధమని) గుండెలా పని చేస్తుందని, రక్త ప్రసరణకు దోహదపడుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఇది హృదయంపై భారాన్ని తగ్గిస్తుందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది.
బృహద్ధమనిని మహాధమని అని కూడా పిలుస్తారు. ఇది అతిపెద్ద రక్తనాళం. ఇన్నేండ్లు ఇది నిరుపయోగమైన రక్తనాళమని శాస్త్రవేత్తలు భావించారు. కానీ, తాజా పరిశోధనల్లో ఇది రక్త ప్రసరణలో (శుద్ధిచేయబడిన రక్తం) కీలకపాత్ర పోషిస్తున్నట్టు వెల్లడైంది. ఇది వేవ్ పంపింగ్ మెకానిజంలా పని చేస్తుందని, రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా ఉపయోగపడుతుందని పరిశోధనల్లో తెలిసింది. ప్రతి హృదయ స్పందన సమయంలో బృహద్ధమని శక్తిని నిల్వ చేసుకుంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ముఖ్యంగా పెద్ద వయస్కుల్లో రక్త ప్రసరణకు ఇది ఎంతగానో దోహదం చేస్తుందని తేలింది. అంతేకాదు, హృదయ వైఫల్యం జరిగినప్పుడు రక్త ప్రసరణ జరిగేలా ఇది సాయపడుతుందని వెల్లడైంది. కొంతమందిలో బలహీనమైన హృదయం కూడా సక్రమంగా ఎలా పని చేస్తుందో దీని ద్వారా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రధాన ధమని ఎలాస్టిసిటిపై పరిశోధనలు చేయడం ద్వారా హృదయ వైఫల్యానికి మెరుగైన చికిత్సను కనుగొనవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.