ముంబై: సంపన్నులు మార్కెట్లోకి వచ్చిన విలాస వస్తువులు.. ప్రత్యేకించి స్పెషలైజ్డ్ కార్ల కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తారు. ఆ కోవకు చెందిన వారే రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. ఈ ఆధునిక భారత కార్పొరేట్ దిగ్గజం కూడా ఎస్యూవీ కార్లంటే చెవి కోసుకుంటారు. తాజాగా ఆయన కార్ల గ్యారేజీలో కొత్త కార్లు వచ్చి చేరాయి.
ఈ ఏడాది ప్రారంభంలోనే ముకేశ్ అంబానీ గ్యారేజీలోకి మూడు అత్యంత విలాసవంతమైన ఎస్‌యూవీలు డెలివరీ అయ్యాయి. ఈ జాబితాలో భారత్‌లోనే అత్యంత ఖరీదైన కారు రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ కూడా చేరింది. విలాసంతోపాటు మెరుగైన పనితీరు, భద్రత ఈ కారు స్పెషాలిటీ.
2018లో భారత్‌కు తెచ్చిన రోల్స్ రాయిస్ కల్లినన్ కారుకు మరిన్ని అధునాతన మెరుగులద్ది కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్‌గా తీసుకు వచ్చారు. దీన్ని గతేడాదిలో విడుదల చేశారు. రెండు కల్లినన్ మోడళ్లను సొంతం చేసుకున్న తొలి ఇండియన్ ముకేశ్ అంబానీ అని తెలిసింది. బ్లాక్ బ్యాడ్జ్ ఎడిషన్ ధర రూ.8.20 కోట్లుగా రోల్స్ రాయిస్ యాజమాన్యం నిర్ణయించింది.
ఇక కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ కారును కొనుగోలు చేయాలని భావించే వారు.. దాంతో రోడ్డెక్కాలంటే ముందు ఖర్చు చేయాల్సింది రూ.10కోట్ల పై మాటే. ఇక కలర్, ఇంటీరియర్స్ మన అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దాలంటే మరింత సొమ్ము ఖర్చు చేయాల్సిందే. సాధారణంగా ముకేశ్ అంబానీ ఆయన కార్లలో పలు రకాల మార్పులు చేయిస్తారు.
ఇక ఈ కారులో 6.75 లీటర్ సామర్థ్యం ఉన్న ట్విన్-టర్బో వీ12 ఇంజన్ ఇందులో ఉంది. బేసిక్ కల్లినన్‌తో పోల్చితే ఈ కారు మరింత శక్తిమంతమైంది. గరిష్ఠంగా 592 హెచ్‌పీ శక్తిని, 900 ఎన్ఎమ్ టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇక 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తున్న ఈ కారు నాలుగు సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వగాన్ని అందుకుంటుంది.
ఎడారి, అడవి, బురద, కొండ ప్రాంతం ఇలా ఎలాంటి ప్రాంతంలోనైనా దూసుకుపోయేలా దీన్ని రూపొందించారు. ఇక కారు ఇంటిరియర్స్లోని పైభాగాన్ని నక్షత్రాల్ని తలపించే ప్రత్యేక డిజైనింగ్ ఆకట్టుకుంటుంది. బ్లాక్బ్యాడ్జ్తోపాటు రోల్స్ రాయిస్ ఫాంటమ్-8, ఫాంటమ్ డీహెచ్సీ తదితర అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కార్లు అంబానీ గ్యారేజ్‌లో ఉన్నాయి. బెంట్లీ బెంటెగా, మసెరటి లెవంటి మోడల్ కార్లు కూడా ఈ ఏడాదే అంబానీ ఇంట్లో చేరాయి.
2020లోనే ముకేశ్ అంబానీ ఈ కార్ల కోసం ఆర్డర్ చేశారని, అవి ఇప్పుడు డెలివరీ అయినట్లు తెలుస్తోంది. వీటితోపాటు ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులు ఇంకా బీఎండబ్ల్యూ ఐ8, ఫెరారీ 812, మెక్లారెన్ 520ఎస్ స్పైడర్, లాంబోర్గినీ అవెంటడర్ ఎస్ రోడ్‌స్టర్, ఫెరారీ 488 జీటీబీ, ఫెరారీ పోర్టోఫినో, యాస్టన్ మార్టిన్ డీబీ11 వంటి సూపర్ కార్లు వాడతారు.