రాష్ట్రంలోని సుమారు 27వేల ప్రభుత్వ పాఠశాలలను 4వేలకు పరిమితం చేయాలన్న ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించింది. ఏఐడీఎస్వో రాష్ట్ర కార్యదర్శి ఏ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉచిత, నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిన హక్కు అని, లక్షలాది పేద విద్యార్థులకు చదువు చెబుతున్న పాఠశాలలను మూసివేయడం వల్ల విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతున్నదని మండిపడ్డారు.
-ఖైరతాబాద్
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : నేర్చుకోవడం.. పరిణతి చెందడం.. భవిష్యత్తు జీవితానికి సిద్ధమవడం.. ఇది విద్యార్జన అంతిమ సారాంశం. బడి అంటే కేవలం పాఠశాల మాత్రమే కాదు; సామాజిక చైతన్యానికి ప్రతీక. దేవాలయం, గ్రంథాలయానికి ఎంతటి విలువ ఉంటుందో, బడికి కూడా అంతే విలువ ఉంటుంది. ఇంతటి ప్రాశస్త్యం గల ప్రభుత్వ స్కూళ్లను కాంగ్రెస్ సర్కార్ కాలగర్భంలో కలిపేయనున్నది. చిన్నారులకు ఉచిత విద్యనందించే సర్కార్ బడులను మూసివేయనున్నది. 27వేల సర్కార్ బడులను 4వేలకు కుదిస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. అంటే 23 వేల స్కూళ్లను మూసివేయనున్నారు. దీనిని ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు తప్పుబడుతున్నారు. స్కూళ్ల కుదింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 18,317 ప్రాథమిక, 3,141 ప్రాథమికోన్నత 4,705 ఉన్నత పాఠశాలలున్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత బడులను మూసివేసి వాటిని 4,705 ఉన్నత బడుల్లో విలీనం చేయాలన్న తలంపుతో సర్కార్ ఉన్నట్టు తెలుస్తున్నది. సుమారు 13 వేల గ్రామ పంచాయతీలుండగా 27 వేల స్కూళ్లను నాలుగువేలకు కుదిస్తే.. మూడు, నాలుగు ఊర్లకో బడి ఉంటుంది. రాష్ట్రంలో సర్కార్ స్కూళ్ల మూసివేతను సర్కార్ ఇప్పటికే ప్రారంభించింది. ఈ విద్యా సంవత్సరం 1,441 జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లను క్లోజ్ చేసింది. 1,388 గురుకులాలను 100కు కుదించనున్నది. దీనికి యంగ్ ఇండియా గురుకులమనే కొత్త పేరును తగిలించింది. ఇప్పుడిక సర్కార్ స్కూళ్లపై పడింది. ఒక్కో స్కూల్లో 350 మంది మాత్రమే విద్యార్థులుంటారు. అంటే 350 మంది విద్యార్థులకు ఒక బడి నడిపేందుకే కుదింపు కుట్ర జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో 27వేల స్కూళ్లను 4వేలకు కుదిస్తాం.. బస్సులు పెట్టి విద్యార్థులను ఇంటి నుంచి పికప్ చేసుకుంటాం.. బడి ముగిసిన తర్వాత ఇంటి వద్ద దింపుతాం.. ఇవి సర్కార్ చెబుతున్న మాటలు. ఒక్కో స్కూల్లో 350 మంది విద్యార్థులున్నారని అనుకుంటే, వీరిని తరలించేందుకు ఒక్కో స్కూల్‌కు 7 బస్సులు కావాలి. అంటే 32,935 బస్సులు కావాలి. అంటే మన ఆర్టీసీ దగ్గర ఉన్న బస్సుల కంటే మూడు రెట్ల అదనపు బస్సులు కావాల్సి దశాబ్దాల చరిత్ర గల ఆర్టీసీ ఆధీనంలో 10వేల బస్సులు కూడా లేవు.
రాష్ట్రంలో 4,703 హైస్కూళ్లు ఉన్నాయి. మిగతా స్కూళ్లను వీటిల్లో విలీనం చేస్తారన్న వాదనలున్నాయి. ఉన్న హైస్కూళ్లలో అనేక సమస్యలున్నాయి. 6 స్కూళ్లు కేవలం ఒకే తరగతి గదితో, 36 స్కూళ్లు రెండు తరగతి గదులతో, 90 స్కూళ్లు మూడు, 223 స్కూళ్లు నాలుగు తరగతి గదులతో నిర్వహిస్తున్నారు. ఐదు తరగతి గదులతో నడస్తున్న బడులు 2,200 కాగా, ఐదు కంటే ఎక్కువ గదులున్న బడులు 2,120 మాత్రమే. ఐదు అంత కంటే తక్కువ గదులతో నడస్తున్న బడుల్లో నర్సరీ నుంచి 12వ తరగతి అంటే 15 క్లాసులు ఉంటాయి. 75 ఏండ్లలో ఐదు గదులున్న బడుల్లో ఇప్పటికిప్పుడు 15 తరగతి గదులు సమకూర్చడం సవాల్‌గా మారనున్నది.
రాజీవ్‌గాంధీ, పీవీ విధానాలకు కొనసాగింపుగా చదువుకోవడాన్ని ఒక హక్కుగా మార్చిం ది కూడా కాంగ్రెస్ సర్కారే. యూపీఏ పాలనలో విద్యాహక్కు చట్టం-2009ని తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా 6-14 ఏండ్లలోపు బాలబాలికలకు ఉచిత, నిర్బంధ విద్యాహక్కు కల్పించబడింది. పరిసరాల్లో బడిలేకపోతే చట్టం అమల్లోకి వచ్చిన మూడేండ్లలోపు బడిని ఏర్పాటుచేయాలి. హ్యాబిటేషన్లకు కిలోమీటర్ లోపు ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్లలోపు ప్రాథమికోన్నత, ఐదు కిలోమీటర్ల లోపు సెకండరీ, 7 కిలోమీటర్ల లోపు హైయ్యర్ సెకండరీ బడులు నెలకొల్పాలి. ఇలాంటి ఆర్టీఈ యాక్ట్‌కు కాంగ్రెస్ సర్కార్ పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది.
పాఠశాల విద్యలో జిల్లా, మండల పరిషత్, ప్రభుత్వ పాఠశాలున్నాయి. మండల కేంద్రాల్లో మాడల్ స్కూళ్లున్నాయి. ఇవన్నీ వేర్వేరు యాజమాన్యాల కింద పనిచేస్తున్నాయి. వీటన్నింటినీ విలీనం చేసే సమయంలో అనేక సమస్యలొస్తాయి. జిల్లా పరిషత్, గవర్నమెంట్ మేనేజ్మెంట్స్ వే ర్వేరుగా ఉంటాయి. ఒకదానిని మరో దా ంట్లో విలీనం చేయడం వీలుపడదు. అంతిమంగా సర్వీస్‌రూల్స్ సుడిగుండంలో చిక్కుకున్నట్టే.
సర్కార్ స్కూళ్ల కుదింపుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్.. రాజీవ్‌గాంధీ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నదన్న వాదనలున్నాయి. అంతేకాకుండా సంస్కరణల పితామహుడు అయిన పీవీ నర్సింహారావు విధానాలను తుంగలో తొక్కుతున్నదని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. విద్యలో అసమానతలు తొలగించడం, సమాన విద్యావకాశాలు కల్పించేందుకు రాజీవ్‌గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో 1986 నూతన జాతీయ విద్యావిధానం వచ్చింది.
ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు విద్యనందించడంపై ఈ విద్యావిధానం ఫోకస్ పెట్టింది. ఆ తర్వాత 1994లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం(డిపెప్) అమల్లోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలు నెలకొల్పారు. కొత్త పాఠశాలలు ఏర్పాటు చేశారు. అప్పటి కాంగ్రెస్ సర్కార్ నెలకొల్పిన స్కూళ్లను ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ కుదించనున్నది.