ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 29: పట్టణాల తరహాలో ప్రతి పల్లెను ఆదర్శంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మండల పరిధిలోని అవుషాపూర్, మాదారం, మర్పల్లిగూడ, ఘనపూర్, వెంకటాపూర్, చౌదరిగూడ, కొర్రెముల, కాచవాని సింగారం గ్రామాలలో రూ.80 లక్షల రూపాయలతో నిర్మాణాలు చేపడుతున్న సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డిలతో కలిసి శంకుస్థాపనలు చేశారు. అవుషాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన పంచాయతీ భవనం, పల్లె దవాఖానలను ప్రారంభించారు.
బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ప్రతి పల్లె, పట్టణాలను అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. రైతులను బజారున పడేసే ప్రయత్నం చేస్తున్న బీజేపీ, నిండా ముంచేందుకు చూస్తున్న కాంగ్రెస్‌లకు ప్రజలు బుద్ధి చెప్పుతారని అన్నారు. జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ, అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అన్నారు. కేసీఆర్‌కు ప్రజాదరణను చూసి తట్టుకోలేకనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అర్థ రహిత ఆరోపణలు చేస్తున్నాయని చెప్పారు.
కార్యక్రమంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఎంపీడీఓ అరుణ, అవుషాపూర్ సర్పంచ్ కావేరి మచ్చేందర్ రెడ్డి, కొర్రెముల సర్పంచ్ వెంకటేశ్ గౌడ్, చౌదరి గూడ సర్పంచ్ బైరు రాములు గౌడ్, కాచవాని సింగారం సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఘనాపూర్ సర్పంచ్ గోపాల్ రెడ్డి, వెంకటాపూర్ సర్పంచ్ గీతా శ్రీనివాస్, మాదారం సర్పంచ్ యాదరిగి, మర్పల్లిగూడ సర్పంచ్ మంగమ్మ, ఎంపీటీసీలు సరళ, రవి, వినోద, రామారావు, భాస్కర్ రెడ్డి, అయా గ్రామాల ఉప సర్పంచ్‌లు, పంచాయతీ సభ్యులు, మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.