ములుగు, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ములుగు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ సోమవారం తీర్పును వెలురించారని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ వెల్లడించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం గ్రామానికి చెందిన కొరగట్ల సత్యనారాయణ ఓ బాలికపై లైంగికదాడి చేయగా 2023లో కేసు నమోదైంది.
పోలీసులు కోర్టులో సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టడంతో విచారించిన జడ్జి .. నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.6 వేల జరిమానా విధించి.. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పును వెలువరించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అప్పటి ఎస్సై సురేశ్, దర్యాప్తు అధికారులు సీఐ శివప్రసాద్, రాజు, కోర్టు మానిటరింగ్ అధికారి, డీఎస్పీ కిశోర్, లైజనింగ్ అధికారి ఎస్సై నాగరాజు, సీడీవో సిబ్బంది మౌనిక, మంగిలాల్ను ఎస్పీ అభినందించారు.