గ్రేటర్ పరిధిలో అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులకు సకాలంలో పదోన్నతులు కల్పించాలని, పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బి.వెంకటయ్య స్పష్టం చేశారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): బల్దియా పరిధిలోని వివిధ విభాగాలలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, రోస్టర్ పాయింట్ల అమలు, వారి సమస్యల పరిష్కారంపై కమిషన్ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. అధికారుల నుంచి విభాగాల వారీగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. చట్టపరమైన నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ, ఎక్కడా వివక్షకు తావు లేకుండా చూడాలని కమిషన్ సభ్యులు అధికారులను ఆదేశించారు. సమాజంలో అత్యంత వెనుకబడిన, కష్టపడే వర్గాలకు న్యాయం చేయడమే కమిషన్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. కార్యక్రమంలో బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.