ఆసిఫాబాద్ టౌన్, జూన్ 22 : జిల్లాలో క్రీడల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధపెట్టి తగు చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలదేవి అన్నారు. సోమవారం జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్లో కలెక్టర్ హరిత, జిల్లా అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, జిల్లా అటవీ అధికారి బాలమణితో కలిసి అధికారులతో సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడారంగంతో పాటు మైదానాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లా కేంద్రంలోని జనకాపూర్ క్రీడా మైదానంలో వసతుల కల్పన, కౌటాల మండల కేంద్రంలోని మినీ స్టేడియం అభివృద్ధికి ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా శాఖల వారీగా చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం క్రీడా శాఖ అధికారులతో కలిసి జిల్లా కేంద్రంలోని జనకాపూర్లోని క్రీడా మైదానం, ఆదర్శ క్రీడా పాఠశాల మైదానాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా యువజన సేవల శాఖ అధికారి అశ్వక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.