35 వేల మంది ఉద్యోగులు, 8 వేల మంది స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్లతో ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతికత కలిగిన సంస్థ అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ). అలాంటి సంస్థను 45 ఏండ్ల పాటు ఓ వ్యక్తి ముప్పుతిప్పలు పెట్టాడు. అగ్రరాజ్యం గగనవీధుల్లో బోయింగ్ విమానాన్ని హైజాక్ చేసి దేశాధ్యక్షుడితో పాటు అధికారులకు చుక్కలు చూపించాడు. చివరకు అతన్ని పట్టుకోలేక అధికారులే చేతులెత్తేసి కేసు మూసేశారు. అమెరికా చరిత్రలో పరిష్కరించలేకపోయిన హైజాక్ కేసుగా నిలిచిన ఆ మిస్టరీ ఉదంతానికి ఈ వారం 50 ఏండ్లు నిండనున్నాయి. ఇంతకీ ఏమిటా కేసు?
సినిమాకు తీసిపోని ట్విస్టులు..
డానియల్ కూపర్ విమానాన్ని హైజాక్ చేసిన తీరు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోదు. అది 1971 నవంబర్ 24. అమెరికాలోని పోర్ట్లాండ్ నుంచి వాషింగ్టన్‌లోని సీటిల్ వెళ్లడానికి 300 మంది ప్రయాణికులతో బోయింగ్ 727 విమానం సిద్ధంగా ఉంది. ఖరీదైన బిజినెస్ సూట్ ధరించిన కూపర్.. తనతోపాటూ ఓ బ్రీఫ్ కేస్, ఓ బ్రౌన్ పేపర్ బ్యాగ్‌తో సీట్లో కూర్చున్నాడు. విమానం గాలిలోకి ఎగరగానే.. ఫ్లైట్ అటెండెంట్‌ని పిలిచి ఆమెకు ఓ నోట్ ఇచ్చాడు. ఆమె దాన్ని తీసుకొని క్యాజువల్‌గా జేబులో పెట్టుకుంది. అది చూసిన కూపర్ ‘హలో మిస్.. నువ్వు ఆ నోటును తెరచి చదవాలి. నా దగ్గర బాంబు ఉంద’ని చెప్పాడు. బ్రీఫ్ కేసు తెరిచి బాంబును చూపించాడు. తన పక్కన సీట్లో కూర్చోమని సైగచేసిన అతను.. ఆమెతో కొన్ని విషయాలు చెప్పి నోట్ రాయమన్నాడు.
నోట్లో ఏమున్నది?
‘సాయంత్రం 5 గంటలకల్లా 2,00,000 డాలర్లు (రూ.1.5 కోట్లు), నాలుగు పారాచ్యూట్లు కావాలి. విమానం ల్యాండ్ అవ్వగానే ఇంధనం నింపేందుకు ఎయిర్‌పోర్టులో ఇంధన ట్రక్ రెడీగా ఉండాలి. తేడా చేశారో… విమానాన్ని పేల్చేస్తా’ అని రాసి ఉంది. ఫ్లైట్ అటెండెంట్ ద్వారా విషయం ఎఫ్‌బీఐ ఏజెంట్లకు తెలిసింది. వెంటనే వారు అతను అడిగినవి సమకూర్చారు. అయితే, విమానం ల్యాండ్ కాగానే నిందితుడిని పట్టుకోవాలనుకున్నారు. కానీ, దీన్ని ముందుగానే అంచనా వేసిన కూపర్.. విమానాన్ని పేల్చేస్తానంటూ మళ్లీ బెదిరించి.. విమానంలో ఇంధనాన్ని నింపుకొన్నాడు. మెక్సికో సిటీ మీదుగా ప్లేన్‌ను నడపమని పైలట్లను ఆదేశించాడు. విమానం ప్రయాణిస్తుండగానే వెనుక డోర్‌ను తెరిపించిన కూపర్.. పారాచ్యూట్ సాయంతో డబ్బుల సంచీతో కిందకు దూకేశాడు. ఆ తర్వాత మళ్లీ ఎవరికీ కనిపించలేదు.
ఏమిటా కేసు?
నవంబర్ 24, 1971న ఓ అమెరికా విమానాన్ని హైజాక్ చేసిన డానియల్ కూపర్ (డీబీ కూపర్) అనే 40 ఏండ్ల వయసున్న వ్యక్తి 2,00,000 డాలర్లు (రూ. 1.5 కోట్లు), నాలుగు ప్యారాచూట్లు సిద్ధం చేస్తే ప్రయాణికులను విడిచిపెడుతానని షరతు విధించాడు. హైజాకర్ అడిగినట్టే అధికారులు అన్నీ సిద్ధం చేశారు. అయితే విమానం ఆకాశంలో ఉండగానే అతను తప్పించుకున్నాడు. 45 ఏండ్లపాటు ( 2016 వరకు) ఎఫ్‌బీఐ ప్రశ్నించని వ్యక్తులు లేరు. సేకరించని ఆధారాలు లేవు. వినియోగించని సాంకేతికత లేదు. అవేమీ అతని జాడను కనిపెట్టలేకపోయాయి.