వాషింగ్టన్, నవంబర్ 9: అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన మహిళ అలైస్ ఒగ్లిట్రీ (36).. మాతృ హృదయాన్ని గొప్పగా చాటుకున్నారు. ప్రపంచంలో అత్యధికంగా తల్లి పాలను దానం చేసిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. ఆమె దానమిచ్చిన తల్లిపాలు.. నెలలు నిండకుండా జన్మించిన వేలాది మంది నవజాత శిశువుల కడుపు నింపుతున్నాయని ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’ వెబ్సైట్ తాజాగా పేర్కొన్నది. టెక్సాస్‌లోని ఫ్లవర్ మౌండ్కు చెందిన 36 ఏండ్ల ఒగ్లిట్రీ జూలై 2023 కల్లా 2,645 లీటర్ల తల్లిపాలు దానం ఇచ్చారని ‘గిన్నిస్’ గుర్తించింది. ‘నా మనసు గొప్పదే. డబ్బులు దానం ఇవ్వలేను. కానీ తల్లి పాలు ఇవ్వొచ్చు కదా! అన్న ఆలోచన వచ్చింది’ అని ‘గిన్నిస్ ఆర్గనైజేషన్’ ఇంటర్వ్యూలో ఒగ్లిట్రీ చెప్పారు. నెలలు నిండకుండా పుట్టిన శిశువులను ఇన్ఫెక్షన్లు చుట్టుముడతాయి. ఇలాంటి శిశువుల కోసం దాతల నుంచి సేకరించిన తల్లి పాలను ‘హ్యూమన్ మిల్క్ బ్యాంక్’ పంపిణీ చేస్తున్నది.