నొప్పిలేని నిమిషమేది..జననమైన మరణమైన జీవితాన అడుగడుగున.. నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీదికాదు.. బ్రతుకు అంటే నిత్య ఘర్షణ దేహముంది.. ప్రాణముంది.. నెత్తురుంది సత్తువుంది.. ఇంతకన్న సైన్యముండునా.. ఆశనీకు అస్త్రమవును.. శ్వాసనీకు శస్త్రమవును.. ఆశయమ్ము సారథవునురా నిరంతరం ప్రయత్నమున్నదా.. నిరాశకే నిరాశ పుట్టదా..ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి..
వరంగల్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలుగు సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి వరంగల్ ఉమ్మడి జిల్లాతో మంచి అనుబంధం ఉన్నది. సినీగేయ రచయితగా ప్రస్థానం మొదలుపెట్టిన కొత్తలోనే ఆయన వరంగల్‌లో అడుగుపెట్టారు. 1986లో ‘సిరివెన్నెల’ సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో జెమినీ థియేటర్‌కు వచ్చారు. ఆ సినిమా తెలుగు సినిమా పాటల శకంలో కొత్త చరిత్ర సృష్టించింది. యువకుడిగా సీతారామశాస్త్రి వచ్చినప్పుడు వరంగల్ ప్రజలు ఎంతో అభిమానం చూపారు. అనంతరం వరంగల్‌కు చెందిన సద్గురు శ్రీశివానందమూర్తితో సీతారామశాస్త్రి అనుబంధం 2008లో మొదలైంది. అప్పటి నుంచి శివానందమూర్తి శివైక్యం అయిన 2015 వరకు సీతారామశాస్త్రి వరంగల్‌కు వచ్చేవారు. ములుగురోడ్డులోని శ్రీశివానందమూర్తి ఆశ్రమానికి కొన్ని వందల సార్లు వచ్చారు.
శివానందమూర్తికి చెందిన భీమిలి ఆశ్రమానికి సైతం వెళ్లేవారు. 2008లో సీతారామశాస్త్రి అనార్యోగానికి గురైనప్పుడు శివానందమూర్తి ఆశ్రమంలో ఆయుర్వేద వైద్యంతోపాటు గురువు ఆశీస్సులు పొందారు. ఆ సమయంలో సీతారామశాస్త్రి పూర్తిగా కోలుకున్నారు. అప్పటి నుంచి శివానందమూర్తితో సీతారామశాస్త్రి అనుబంధం బాగా పెరిగింది. ఒకరకంగా శివానందమూర్తికి సీతారామశాస్త్రి పుత్రసమానుడిగా ఉండేవారు. ఆశ్రమంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా, వ్యక్తిగతంగా ఏ సందర్భం అయినా సీతారామశాస్త్రి వరంగల్‌కు వచ్చేవారు. శివానందమూర్తి ఆశ్రమంతోపాటు వరంగల్‌లోని సాహిత్యకారులు, కళాకారులతో సీతారామశాస్త్రికి మంచి అనుబంధం ఉన్నది. వ్యక్తిగత సంబంధాలకు ప్రాధాన్యం ఇచ్చే సీతారామశాస్త్రి వరంగల్ నుంచి సినిమా రంగంలో స్థిరపడిన వారిని ఆశీర్వదించారు. ఈ రంగంలోకి వృద్ధిలోకి వచ్చేలా ప్రోత్సహించారు.
గోపీ అని నోరారా పిలిచేవారు
సిరివెన్నెల సీతారామశాస్త్రితో 2008 నుంచి అనుబంధం ఉంది. గురువుగారి ఆశ్రమానికి నిత్యం వస్తుండేవారు. గొప్ప మనసున్న మనిషి. గోపీ అని నోరారా పిలిచేవారు. వాళ్లింటో ఏ శుభకార్యం జరిగినా ఆహ్వానించేవారు. వాళ్ల కుటుంబంతో మాకు ఎంతో ఆప్యాయత ఉంది. అన్ని విషయాల్లోనూ ఉన్నతంగా ఉండేవారు. ఆయన అకాల మరణం బాధాకరం. వరంగల్‌తో ఆయనకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి.
ఆయన పాటలంటే పిచ్చి
సీతారామశాస్త్రి పాటలు అంటే నాకు పిచ్చి. గోవిందుడు అందరివాడే సినిమా సమయంలో దర్శకుడు కృష్ణవంశీ పాట రాయాలని నన్ను పిలిపించారు. నేను వెళ్లినప్పుడు సీతారామశాస్త్రి అక్కడే ఉన్నారు. కృష్ణవంశీ నన్ను పరిచయం చేయగానే.. నన్ను పాట పాడాలని సిరివెన్నెల అడిగారు. ‘ఓయమ్మ నా పల్లె సీమ’ పాట పాడిన. పాట విని నన్ను హత్తుకుని అభినందించారు. వరంగల్‌తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. సీతారామశాస్త్రి మరణం ఎంతో బాధగా ఉంది.
ఎప్పటికీ గొప్పవే
సిరివెన్నెల గొప్ప రచయిత. ఆయన పాటలు వింటే చెప్పలేని అనుభూతి కలుగుతుంది. అమెరికాలో ఉన్న సమయంలో ఆయనను కలిశాం. రచయితగానే కాకుండా మంచి మనిషి. సిరివెన్నెల రాసిన పాటలు ఇప్పటికీ, ఎప్పటికీ గొప్పగానే ఉంటాయి.
ఆయన విశిష్ట కవి
సిరివెన్నెల విశిష్ట కవి. సినిమా పాటలకు సాహిత్య గౌరవాన్ని ఇచ్చారు. తెలుగులో మంచి భాష, అందమైన పదాలతో రాసిండు. రెండుమూడుసార్లు వ్యక్తిగతంగా కలిశాను. నా అంపశయ్య నవలను గుర్తు చేసి మాట్లాడారు. సీతారామశాస్త్రి తెలుగు సినిమా గర్వించదగిన రచయిత. చిన్న వయస్సులో ఆయన మరణం నిజంగా దిగ్భ్రాంతి కలిగించింది. ఇది తెలుగు చిత్రసీమకు పెద్ద లోటు.