e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 12, 2021
Advertisement
Home News నిర్మాణ రంగంలో కేంద్ర బిందువు

నిర్మాణ రంగంలో కేంద్ర బిందువు

నిర్మాణ రంగంలో కేంద్ర బిందువు
  • ఒక్క మున్సిపాలిటీ పరిధిలో 32 గేటెడ్‌ కమ్యూనిటీలు… 
  • మరో 50 వరకు పురోగతిలో..
  • ఒక్కో విల్లా విలువ రూ.3 కోట్లు.. గరిష్టంగా రూ.10 కోట్ల వరకు     

ఒక్క మున్సిపాలిటీ.. 32 గేటెడ్‌ కమ్యూనిటీలు.. 5 గ్రామ పంచాయతీల పరిధితో 34 చదరపు కి.మీ వైశాల్యం.. ఒకవైపు   ఐటీ కారిడార్‌.. మరో వైపు ఔటర్‌ రింగ్‌ రోడ్డు… ఇదీ తెల్లాపూర్‌ మున్సిపాలిటీ ప్రత్యేకత. నగర శివారులో, ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న మునిసిపాలిటీల్లో అత్యంత ఖరీదైన, అందరూ ఇష్టపడే ప్రాంతంగా   పేరుగాంచింది. ఒకప్పుడు  కుగ్రామంగా ఉండి.. నేడు మినీ నగరాన్ని తలపిస్తున్నది. ఎటూ చూసినా కళ్లు చెదిరే భారీ భవంతులు.. విదేశాల్లో ఉన్నామనే రీతిలో ఆకాశహర్మ్యాలు ..అబ్బురపరిచే రీతిలో పుట్టుకొస్తున్న నూతన నిర్మాణాలు..వెరసి ‘హైదరాబాద్‌ రియల్‌ రంగం’లో తెల్లాపూర్‌ మణిహారంగా నిలుస్తున్నది. హైదరాబాద్‌లో ఐటీరంగం దినాదినాభివృద్ధి చెందడంతో ఆధునిక నగరంగా తెల్లాపూర్‌ ఇప్పుడు కేంద్ర బిందువుగా నిలుస్తున్నది.

ఐటీ కారిడార్‌లో ఇప్పుడు హాట్‌ కేక్‌ అంటే తెల్లాపూర్‌… గచ్చిబౌలి ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్‌లోని విప్రో సర్కిల్‌ నుంచి కేవలం ఐదు కి.మీ దూరం .. అటు నల్లగండ్ల నుంచి 2 కి.మీ.. ఇటు కోకాపేట నుంచి 5 కి.మీ…ఇక హైదరాబాద్‌ మహానగరానికి మణిహారంగా ఉన్న ఔటర్‌ రింగ్‌రోడ్డుకు ఇరువైపులా తెల్లాపూర్‌ మునిసిపాలిటీ విస్తరించి ఉంది. తాజా లెక్కల ప్రకారం 5 గ్రామ పంచాయతీలు ఉంటే…  గేటెడ్‌ కమ్యూనిటీలు ఏకంగా 32 వరకు ఉన్నాయి. ఇవీ భవిష్యత్తులో 50కి పైగా పెరగనున్నాయి. వీటిలో 20 నుంచి 30 అంతస్థుల్లో ఉండే  హైరైజ్‌ అపార్టుమెంట్లే అధికంగా రానున్నాయి. హెచ్‌ఎండీఏ ప్రతిపాదించిన తెల్లాపూర్‌ టెక్నోసిటీని ఏకంగా  100 ఎకరాల్లో నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

అన్నీ భారీ ప్రాజెక్టులే….

భవన నిర్మాణ రంగంలోని పెద్ద పెద్ద కంపెనీలు తెల్లాపూర్‌లో తమ ప్రాజెక్టులను భారీ స్థాయిలో చేపడుతున్నాయి. ఒక్కో గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టు 4 ఎకరాల నుంచి 50 ఎకరాలు. అంతకంటే ఎక్కువ మొత్తంలోనే ఇక్కడ టౌన్‌షిప్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక్కడ నివాసం ఉంటున్న వారిలో వ్యాపార వేత్తలు… ఉన్నత విద్యా వంతులు.. ఐటీ కంపెనీల ప్రతినిధులు ఉన్నారు. గేటెడ్‌ కమ్యూనిటీలో విలాసవంతమైన డ్లూప్లెక్స్‌, త్రిపులెక్స్‌ విల్లాలు ఉన్నాయి. 

ఒక్కో విల్లా రూ.3 కోట్ల నుంచి మొదలు ..

ఇక్కడ ఒక్కో విల్లా విలువ రూ.3 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉంటుంది.  గేటెడ్‌ కమ్యూనిటీల్లోని విల్లా ధర 260 గజాల్లో అయితే రూ.3 కోట్లు ఉండగా, 700 గజాలు, 1000 గజాల్లోనూ లగ్జరీ విల్లాలు  ఉన్నాయి. వీటి ఖరీదు సుమారు రూ.6 కోట్ల నుంచి రూ.10 కోట్లుగా ఉంటోంది. తెల్లాపూర్‌లో ఉన్న అన్ని గేటెడ్‌ కమ్యూనిటీల్లో లోపల బ్రహ్మండంగా ఉంటుంది. అయితే గేటు దాటి బయటకు వస్తే మాత్రం అతుకులతో కూడిన గతుకుల రోడ్లు.. కనిపించని డ్రైనేజీ , పరిమితంగానే మంచినీటి సౌకర్యం…  ఆడుకోవడా నికి లేని పార్కు, అంత్యక్రియలు జరిపేందుకు తగిన స్థలం కూడా లేదు. దీంతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు.

2 రేడియల్‌ రోడ్లు…

మౌలిక వసతుల పరంగా ప్రభుత్వం ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అనుసంధానిస్తూ రెండు రేడియల్‌ రోడ్ల నిర్మాణం చేపడుతున్నది. ఈరెండింటి పనులు పురోగతిలో ఉన్నాయి. నానక్‌రాంగూడ ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌చేంజ్‌ నుంచి గచ్చిబౌలి ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్‌ మీదుగా తెల్లాపూర్‌ నుంచి కొల్లూరు ఓఆర్‌ఆర్‌ వరకు 7.6 కి.మీ దూరంతో రేడియల్‌ రోడ్డు నిర్మిస్తోంది. అదేవిధంగా నల్లగండ్ల  నుంచి తెల్లాపూర్‌ మీదుగా రైల్వే ట్రాక్‌ వెంట ఈదుల నాగుల పల్లి ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ను కలుపుతూ మరో రేడియల్‌ రోడ్డును నిర్మిస్తున్నారు. ఇవి పూర్తయితే తెల్లపూర్‌కు ఇవి మణిహారాలుగా మారనున్నాయి. 

కల్పించాల్సినమౌలిక వసతులు

  • గచ్చిబౌలి విప్రో సర్కిల్‌ నుంచి చేపట్టిన రేడియల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం ఏండ్ల తరబడిగా అసంపూర్తిగా ఉంది. దీన్ని వెంటనే పూర్తి చేయాలి.
  • గ్రామాల్లో ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ ద్వారా మంచినీటిని ప్రభుత్వం అందిస్తోంది. అయితే తెల్లాపూర్‌ మునిసిపాలిటీలో మంచినీటి సరఫరా ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు.
  • డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు.  గేటెడ్‌ కమ్యూనిటీలు మినహాయిస్తే ఇతర ప్రాంతాల్లో రోడ్ల మీద మురుగునీరు పారుతోంది. 
  • తెల్లాపూర్‌లోని 323/14 సర్వే నంబర్‌లో ఉన్న ప్రభుత్వం స్థలాన్ని  మునిసిపాలిటీకి కేటాయిస్తే మునిసిపల్‌ కార్యాలయంతో పాటు మార్కెట్‌, ఇతర అవసరాలకు స్థలం వాడుకోవచ్చు.
  • రోడ్ల వెంట వీధి దీపాలు ఏర్పాటు చేయాలి. 
  • వర్షాకాలంలో రహదారులు అధ్వానంగా మారుతున్నాయి. వెంటనే బాగు చేయాలి.

 మౌలిక వసతులు అంతంత మాత్రమే..

ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు లేవు. గేటెడ్‌ కమ్యూనిటీ గేటు నుంచి బయటకు వస్తే రోడ్లన్నీ అధ్వానంగా ఉంటాయి. వర్షాకాలం వచ్చింటే మట్టి రోడ్లన్నీ గుంతలు పడి కార్ల్ల రాకపోకలు సాగించలేని పరిస్థితి. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాలను కల్పించాలి.- రాధ, సాంసియా విల్లాస్‌, గేటెడ్‌ కమ్యూనిటీ

అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోవాలి

తెల్లాపూర్‌లో భారీ రెసిడెన్షియల్‌ గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టులు ఉన్నాయి. 4-5 ఎకరాల నుంచి మొదలుకొని 50 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ గేటెడ్‌ కమ్యూనిటీలు, హైరైజ్‌ అపార్టుమెంట్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలా మొత్తం 32 గేటెడ్‌ కమ్యూనిటీలు ఉన్నాయి. అన్ని గేటెడ్‌ కమ్యూనిటీలతో కలిసి తెల్లాపూర్‌ నైబర్‌హుడ్‌ అసోసియేషన్‌ (తెనా)ను ఏర్పాటు చేశాం. ఇక్కడ ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులపై అటు ప్రభుత్వానికి, ఇటు తెల్లాపూర్‌ మునిసిపాలిటీ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం.  ఈ మునిసిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలి.   – రమణ, తెల్లాపూర్‌ నైబర్‌హుడ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

రూ.35 కోట్లతో ఎస్‌టీపీ నిర్మాణం 

మునిసిపాలిటీ పరిధిలో నివా స ప్రాంతాలు గణనీయంగా పెరుగుతున్నాయి. దానికి అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తున్నాం. ముఖ్యంగా సీవరేజ్‌కు సంబంధించి మునిసిపాలిటీ పరిధిలోనే రూ.35 కోట్ల సీవరేజ్‌ ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, స్మశాన వాటికల అభివృద్ధి కోసం ప్రభుత్వం 8-10 ఎకరాల భూమిని కేటాయించాలని మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావులను కోరాం. – లలితా సోమిరెడ్డి, చైర్‌పర్సన్‌, తెల్లాపూర్‌ మునిసిపాలిటీ

ఏడాదిలో రూ.13 కోట్లతో అభివృద్ధి పనులు  

తెల్లాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలో ఏడాది వ్యవధిలో రూ.13 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టాం. 5 గ్రామ పంచాయతీలతో పాటు బస్తీలు, కాలనీలు ఉన్న ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను కల్పిస్తున్నాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా మంచినీటి సరఫరా, సీవరేజ్‌ వ్యవస్థను మెరుగు పర్చాల్సి ఉంది.   5 ఎకరాల్లో చెత్త, వ్యర్థాలను శుద్ధి చేసేందుకు డీఆర్‌సీసీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాం. – డాక్టర్‌.వెంకట మణికిరణ్‌, కమిషనర్‌, తెల్లాపూర్‌ మునిసిపాలిటీ

Advertisement
నిర్మాణ రంగంలో కేంద్ర బిందువు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement