కామారెడ్డి, డిసెంబర్ 16: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న శ్యామాప్రసాద్ ముఖర్జీ రూర్బన్ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ గురువారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో కామారెడ్డి జిల్లా జుక్కల్ క్లస్టర్ మొదటిస్థానం (92.98 స్కోర్)లో, సం గారెడ్డి జిల్లా రాయికల్ క్లస్టర్ ద్వితీయ స్థానం(92.41 స్కోర్)లో నిలిచాయి. నల్లగొండ జిల్లాలోని కొండభీమనపల్లి 89.60 స్కోర్‌తో 8వ ర్యాంక్ సాధించింది.
గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ స్థాయి మౌలిక వసతులు, సదుపాయాలు, ఆధునిక హంగులు కల్పించడం ఈ పథకం ఉద్దేశం. దేశంలోని 381 క్లస్టర్లలో ఈ పథకా న్ని అమలు చేస్తుండగా రాష్ట్రంలో 17 క్లస్టర్లలో కొనసాగుతున్నది. ఈ పథకానికి కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూర్చాలి. రాష్ట్రం అదనంగా నిధులు జోడిస్తున్నది. రాష్ట్రంలోని 17 క్లస్టర్లకు సీజీఎఫ్ కింద ఇవ్వాల్సిన రూ.435 కోట్లతో పా టు అదనంగా రూ.1,450 కోట్లను జోడించి, మొత్తం రూ.1,885 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. ఈ పథకం కింద సిమెంట్ రోడ్లు, కాల్వలు, తాగునీటి వనరుల అభివృద్ధి, సామాజిక, ఆరోగ్య కేంద్రాల భవనాలు, గోదాములు, డిజిటల్ తరగతులు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, యువతకు శిక్షణా కేంద్రాలు, బస్షెల్టర్ల నిర్మాణం చేపడతారు.
జుక్కల్‌లో మారుతున్న రూపురేఖలు
2016లో రూర్బన్ పథకం కింద ఎంపికైన జుక్కల్‌లో 363 పనులను గుర్తించి, ఇప్పటివరకు 287 పనులను పూర్తి చేశారు. రూ.30 కోట్లను కేటాయించగా రూ.22.85 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.8 కోట్లు విడుదల కావాల్సి ఉన్నది. 36 సీసీ రోడ్లు, 16 బస్సు షెల్టర్లు, రూ.14 లక్షలతో బల్క్మి ల్క్ చిల్లింగ్ సెంటర్, అగ్రికల్చర్ గోడౌన్, మూడు కుట్టుమిషన్ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో 22 అదనపు తరగతి గదులు, ఎనిమిది అంగన్వాడీ భవనా లు, ఐదు గ్రామ పంచాయతీ భవనాలు, 43 డిజిటల్ తరగతి గదులు (ప్రొజెక్టర్, సిస్టం) నిర్మించారు. ఏడు చెక్‌డ్యాంలకు ఆరు పూర్తయ్యాయి. జుక్కల్ మండల కేంద్రంలో రూ.కోటితో మినీ స్టేడియం నిర్మాణ పను లు, రూ.30 లక్షలతో గ్రీనరీపార్క్ నిర్మాణం కొనసాగుతున్నది. వివిధ గ్రామాల్లోని రైతులకు 71 కూరగాయల పందిళ్లు కేటాయించగా, ఇప్పటివరకు 12 పూర్తయ్యాయి.
దేశంలో టాప్‌లో ఉండటం సంతోషకరం
రూర్బన్ పథకం అమలులో జుక్కల్ క్లస్టర్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినందుకు సంతోషంగా ఉన్నది. ఇప్పుటివరకు 92 శాతం పనులు పూర్తయ్యాయి. నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తున్నాం. నిధులను సక్రమంగా ఖర్చు చేశాం. ఇప్పటివరకు రూ.22.85 కోట్లతో వివిధ పనులు పూర్తిచేశాం. మినీస్టేడియం, గ్రీన్‌పార్కుల పనులు కొనసాగుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యమైంది.