హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి కేటాయించిన ఎరువుల సరఫరాలో జాప్యాన్ని నివారించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. సాగు అవసరాలకు అనుగుణంగా వెంటనే ఎరువులను సరఫరా చేయాలని కేంద్ర రసాయనాలశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మంగళవారం లేఖ రాశారు. అక్టోబర్, నవంబర్ నెలలకు 6.40 లక్షల టన్నుల ఎరువులను కేటాయించి, ఇప్పటివరకు 1.55 లక్షల టన్నులే సరఫరా చేశారని గుర్తుచేశారు. యాసంగికి 20.5 లక్షల టన్నుల ఎరువులను కేటాయించిన కేంద్రం అందుకు అనుగుణంగా సరఫరా చేయడం లేదని పేర్కొన్నారు. సరఫరాలో జా ప్యం సాగుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నదని, దీన్ని నివారించేందుకు విదేశాలనుంచి వచ్చిన ఎరువులను కేటాయించాలని కోరారు.