హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : బడుల్లో బాహ్య మూల్యాంకనం చేపట్టాలన్న విద్యాశాఖ నిర్ణయం వివాదానికి తెరలేపింది. విద్యాశాఖ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఉపసంహరించుకోవాలని ముక్తకంఠంతో నినదించాయి. రాష్ట్రంలోని 1-10వ తరగతి వరకు గల విద్యార్థుల సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ) -1 జవాబు పత్రాలను ఎక్స్టర్నల్ వాల్యుయేషన్ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.
అక్టోబర్‌లో జరుగనున్న సమ్మేటివ్ పరీక్షకు ఈ మేరకు మంగళవారం మార్గదర్శకాలను కూడా జారీచేసింది. పరీక్షలు పాఠశాల స్థాయిలోనే జరుగుతాయని, పరీక్ష పూర్తయిన రోజే హెచ్ఎంలు జవాబుపత్రాలను మండల రీసోర్స్ సెంటర్ (ఎమ్మార్సీ)కి చేర్చాలని సూచించింది. ఎంఈవోలు వాల్యుయేటర్లను నియమించి మూడు నుంచి ఐదు రోజుల్లో మూల్యాంకనం పూర్తిచేసి, ఆన్లైన్లో మార్కులు ఎంట్రీని చేయాలని ఆదేశించింది. విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పీఆర్టీయూ టీఎస్, యూటీఎఫ్, ఎస్టీయూ, తపస్, టీపీఆర్టీయూ, ఎస్‌ఎల్‌టీఏ, టీఎస్టీయూ వంటి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిని అనాలోచిత నిర్ణయంగా అభివర్ణించాయి. పైగా ఇది విద్యాహక్కు చట్టానికి విరుద్ధమని, బాహ్య మూల్యాంకనాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వెనక్కి తగ్గిన సర్కార్
ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తంకావడంతో విద్యాశాఖ వెనక్కి తగ్గింది. ఉపాధ్యాయ సంఘాలు బాహ్య మూల్యాంకనాన్ని వ్యతిరేకిస్తూ అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించంతో అప్రమత్తమైన విద్యాశాఖ బుధవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపింది. సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు పుల్గం దామోదర్‌రెడ్డి (పీఆర్టీయూ టీఎస్), వోడ్నాల రాజశేఖర్ (తపస్), జీ సదానందంగౌడ్, జుట్టు గజేందర్ (ఎస్టీయూ టీఎస్), కటకం రమేశ్ (టీఆర్టీఎఫ్), వెంకట్ (టీఎఎస్ యూటీఎఫ్), పోచయ్య (ఎస్టీఎఫ్) హాజరయ్యారు. దాదాపు అన్ని సంఘాలు ముక్తకంఠంతో బాహ్య మూల్యాంకనాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో సర్కార్ వెనక్కి తగ్గింది.
పైలెట్ పద్ధతిలో..
బాహ్య మూల్యాంకనాన్ని రాష్ట్రమంతా అన్ని తరగతులకు, ఒకేసారి కాకుండా పైలెట్ పద్ధతిలో అమలు చేస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అంతేకాకుండా 6, 9 తరగతులకే పరిమితం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 9వ తరగతిలోని అందరు విద్యార్థులకు, 6వ తరగతిలోని వారికి 9 జిల్లాల్లో బాహ్య మూల్యాంకనాన్ని అమలు చేస్తామని అధికారులు ప్రకటించారు. 6వ తరగతి వారికి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కుమ్రం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో బాహ్య మూల్యాంకనం అమలు చేస్తామని తెలిపారు.
ఎస్సెస్సీ పరీక్షలు ముగియగానే బదిలీలు
ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు సమావేశంలో ప్రస్తావించారు. పదో తరగతి పరీక్షలు ముగియగానే బదిలీల షెడ్యూల్‌ను విడుదల చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి తమకు హామీ ఇచ్చినట్లు టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్ తెలిపారు. 190 జీవో అమలు అంశాన్ని కూడా ప్రస్తావించగా, ఇదే బదిలీల్లో అవకాశం కల్పిస్తామని చెప్పినట్టు వెల్లడించారు.