హైదరాబాద్ : రాష్ట్రం ఆర్థిక అరాచక వాది చేతిలో ఆగమై పోతోందని బీఆర్ఎస్ నాయకుడు గట్టు రామచందర్ రావు ( Gattu Ramchander Rao ) ఆరోపించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth ) అనుచిత వాగ్దానాలు చేసి ప్రజలను బకరాలను చేశారని విమర్శించారు.
అబద్దాలు ప్లస్ బూతులు ఈక్వల్ టూ కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు.
క్రిమినల్ చేతిలో హోం శాఖ ఉంది. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం క్రైం రేటు పెరుగు తోందని, ఈ సంవత్సరం 14 శాతం క్రైం రేటు పెరగడం రేవంత్ సాధించిన ఘనత అని అన్నారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులున్నాయని, హంతకులు సెల్ఫీలు తీసుకుని మరీ హత్యలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు సీఎం మనుషుల సేవలో తరిస్తున్నారని, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడానికే పోలీసులు సమయం వెచ్చిస్తున్నారని విమర్శించారు.
గాంధీ భవన్ బూతులకు అడ్డాగా మారిందని, కొందరికి కేబినెట్ హోదా ఇచ్చి మరీ బీఆర్ఎస్ నేతలను తిట్టిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గాలంటే రేవంత్ తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వేల ఎకరాలు కొల్లగొట్టి అక్రమంగా డబ్బులు వెనకేసుకుంటున్నారని, త్వరలోనే ఆయన బండారం బయట పడుతుందని వెల్లడించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బీజేపీ కి తాకట్టు పెట్టడం పక్కా అని తెలిపారు.