హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఖైదీల్లో మాదకద్రవ్యాల వినియోగ సమస్యను గుర్తించి, వారికి చికిత్స, కౌన్సెలింగ్, పునరావాసం అందిస్తున్న తెలంగాణ జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ శాఖ చేపట్టిన ‘నివృత్తి డీ-అడిక్షన్ కేంద్రం’ కార్యక్రమానికి స్కోచ్ అవార్డు-2026 లభించిం ది. న్యూఢిల్లీలోని ఇండియా హాబిటా ట్ సెంటర్లో నిర్వహించిన 109వ స్కోచ్ సమ్మిట్-ఇండియా ఎకనమిక్ ఫోరంలో స్కోచ్ లా ఆఫీసర్స్ వ్యవస్థాపకుడు రోహన్ కొచర్, స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచర్ నుంచి ఈ పురసారాన్ని జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా అందుకున్నారు.
‘నివృత్తి’ కార్యక్రమం లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలోని ఐదు జైళ్లలో డీ-అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సెంట్రల్ ప్రిజన్ హైదరాబాద్, సెంట్రల్ ప్రిజన్ చర్లపల్లి, సెంట్రల్ ప్రిజన్ సంగారెడ్డి, సెంట్రల్ ప్రిజన్ నిజామాబాద్, స్పెషల్ ప్రిజన్ ఫర్ ఉమెన్-హైదరాబాద్లో ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఖైదీల్లో మాదకద్రవ్య వినియోగ సమస్యలను గుర్తించడం నుంచి చికిత్స, కౌన్సెలింగ్, ప్రవర్తనా మార్పు, పునరావాసం వరకు సమగ్ర సేవలను అందిస్తున్నారు.
జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా అవసరమైన సహకారం అందిస్తూ సమాజంలో తిరిగి కలిసేలా చేయడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ‘నివృత్తి’ కార్యక్రమం కింద ఇప్పటివరకు 4,200 మంది ఖైదీలను స్రీనింగ్ చేసినట్లు జైళ్లశాఖ డీజీ తెలిపారు. ఇందులో 2,126 మందికి డబ్ల్యూహెచ్వో-అసిస్ట్ స్రీనింగ్ నిర్వహించి, అవసరమైన వారికి కౌన్సెలింగ్, చికిత్స అందించామని అన్నారు. 300 మంది ఖైదీలకు జైలు నుంచి విడుదల అనంతరం కూడా అవసరమైన సహాయాన్ని అందించామని, డ్రగ్స్ వ్యసనాన్ని అధిగమించిన తర్వాత తిరిగి అదే పరిస్థితుల్లోకి వెళ్లకుండా ‘ఆఫ్టర్ కేర్’ వంటి సామాజిక పునరేకీకరణపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు.