CM Chandrababu |హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ సీఎం చంద్రబాబా? లేక రేవంత్‌రెడ్డా?’ మంగళవారం సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున జరిగిన చర్చ ఇది. ఎక్స్ వేదికగా వైరల్ అయిన ఒక లేఖ ఈ దుమారానికి కారణం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారి పూర్తి వివరాలు అందించాలంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పీఎస్ ఇన్స్పెక్టర్ పేరుతో ఎక్స్ కంపెనీకి రాసిన ఓ లేఖ మంగళవారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
తమ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కేసు విచారణలో ఉన్నదని, ఈ సమయంలో ఎక్స్ వేదికగా చంద్రబాబును విమర్శిస్తూ, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నారని, వారి వివరాలు కావాలంటూ ఆ లేఖలో కోరారు. రిజిస్టర్డ్ యూజర్ డిటైల్స్ అంటే వారి పేరు, యూజర్‌నేమ్, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, అకౌంట్ తెరిచిన తేదీ, రిజిస్టర్డ్ ఐపీ అడ్రస్, ఐపీ లాగిన్ హిస్టరీ విత్ టైమ్‌స్టాంప్స్, అకౌంట్ కొనసాగించిన పరికరం తదితర వివరాలు ఇవ్వాలంటూ ఎక్స్ (ట్విట్టర్)ను సైబర్‌క్రైమ్ అధికారి కోరినట్టు ఆ లేఖలో ఉన్నది. దీంతో ఈ లేఖపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టుల మీద టీడీపీగానీ, చంద్రబాబుగానీ, ఆయన అభిమానులుగానీ ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా పోలీసులే సుమోటోగా తీసుకుని ఏకంగా అమెరికాకు లేఖలు రాస్తున్నారంటూ ఆరోపించారు.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే కేసులు పెట్టాల్సిన తెలంగాణ పోలీసులకు చంద్రబాబును విమర్శిస్తే బాధేమిటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ పౌరులు ఎవరైనా ఏపీ సీఎంను విమర్శిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడితే త్వరలోనే సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేస్తారంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఏపీ సీఎంను విమర్శిస్తే తెలంగాణ పోలీసులు ఎందుకు నోటీసులు ఇస్తున్నారని, ఇది రేవంత్‌రెడ్డి స్వామిభక్తిని చాటుకోవడంలో భాగమా? అని అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ వివాదంపై సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్‌బాబు స్పందించారు. సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న లేఖను పరిశీలిస్తున్నామని, దీని వెనుక ఏం జరిగిందో ఆరాతీస్తున్నామని తెలిపారు.

Police Go