Harish Rao | కాంగ్రెస్ మంత్రులు ‘బస్తీ మే సవాల్’ అంటూ తొడగొట్టారు. ‘తెలంగాణభవన్‌కే వస్తాం.. దేఖ్ లేంగే’ అంటూ మీసాలు తిప్పారు. వాళ్ల సవాళ్లు నిజమేనేమో అనుకొని బీఆర్ఎస్ నేతలు జనం మధ్య నిలబడి ఎదురు చూశారు. తీరా అసలు సమయం వచ్చేసరికి మంత్రులు పోలీసుల వెనుక దాక్కున్నారు. అమరుల స్థూపం వెనుక రక్షణ వలయం ఏర్పాటు చేసుకొని దమ్ముంటే ఇక్కడికే రమ్మని మరో సవాల్ విసిరారు.
గన్‌పార్క్ నుంచి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన హరీశ్‌రావు.. అవినీతి అప్పులపై చర్చించేందుకు ప్రెస్‌క్లబ్‌కు రమ్మని తాను సవాల్ చేస్తే.. అమరవీరుల స్తూపం వద్దకు రమ్మన్నారని, తమకు ఎలాంటి భేషజాలు లేవని, తామే గన్‌పార్క్ వద్దకు బయల్దేరుతున్నామని ప్రకటించారు. సాయంత్రం వరకూ చర్చిద్దామని, ఈలోగా మంత్రులు అక్కడి నుంచి పరారవ్వొద్దని, మధ్యలో తమను అరెస్ట్ చేయించే కుట్రలు చేయొద్దని హెచ్చరికలు చేసుకుంటూ బయలుదేరారు. వారి వెంట ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు బీఆర్ఎస్ శ్రేణులు అనుసరించాయి. అయితే, తెలంగాణభవన్ గేటు దాటకముందే పోలీసులు వారిని చుట్టుముట్టి అడ్డుకొన్నారు.
ఈ సందర్భంగానే హరీశ్‌రావు తనను చర్చలకు పిలిచిన ముగ్గురు మంత్రులతో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించారు. చర్చలకు రమ్మని పిలిచి పోలీసులతో అరెస్టు చేయించడం పద్ధతి కాదని, శాంతియుత వాతావరణంలో టెండర్లలో జరిగిన అవినీతి మీద సాయంత్రం వరకు చర్చిద్దామని చెప్పడానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్‌కు ఫోన్లు చేశారు. కానీ మంత్రులెవ్వరూ ఆయన ఫోన్లు ఎత్తలేదు. హరీశ్‌రావు ఫోన్లు చేస్తున్న సమయంలో ముగ్గురు మంత్రులు సీఎల్పీలో ఉన్నట్టు తెలిసింది.
ఆయన ఫోన్‌కాల్‌ను చూస్తూ..‘ఎత్తొద్దు’అని చెప్పుకోవడం ఆక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు గమనించారు. ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడిన హరీశ్‌రావు.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తాము ఇకడికి వచ్చింది కొట్లాడటానికి కాదని, చర్చించడానికని స్పష్టంచేశారు. గురుకుల టెండర్లలో జరిగిన అవకతవకలకు సంబంధించిన అన్ని డాక్యుమెంటరీ ఆధారాలను చేతిలో పట్టుకొని వస్తున్నాం. కాంగ్రెస్ మంత్రులే సవాల్ విసిరి, ఇప్పుడు తమను అడ్డుకోవడానికి పోలీసులను ప్రయోగించడం సిగ్గుచేటు’ అని మండిపడ్డారు.
తాను ఫోన్ చేస్తే మంత్రులెవరూ ఎత్తడంలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. అయితే, ఇది వాస్తవమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అంగీకరించారు. తమకు హరీశ్‌రావు ఫోన్ చేశారని, కానీ తామే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదని స్పష్టంచేశారు. అప్పటికే తాము గన్‌పార్క్ నుంచి వెళ్లిపోయామని, అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నామని తెలిపారు. కార్యక్రమంలో ఉన్నాం కాబట్టే ఫోన్ ఎత్తలేదని చెప్పారు.
‘మాకు హరీశ్‌రావు ఫోన్ చేశారు. మేమే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పటికే మేము గన్‌పార్క్ నుంచి వెళ్లిపోయినం. అధికారిక కార్యక్రమంలో ఉన్నం కాబట్టే ఫోన్ ఎత్తలేదు. వారిని పోలీసులు అరెస్టు చేస్తే మాకేం సంబంధం?‘
– పొన్నం ప్రభాకర్