హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల కల్పన, అత్యాధునిక టెక్నాలజీని ప్రభుత్వశాఖల్లో సమర్థంగా వినియోగిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిందని హైదరాబాద్‌లో జరిగిన 24వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో వక్తలు కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీతో అమలుచేస్తున్న ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకోవాలని, ఇతర రాష్ర్టాలు ప్రభుత్వ సేవల రూపకల్పన, డెలివరీలో డిజిటల్‌ను ప్రాథమిక అంశంగా చేసుకోవాలని తీర్మానించారు. డ్రోన్ టెక్నాలజీతో మారుమూల ప్రాంతాలకు మందులను సకాలంలో చేరవేసే మెడిసిన్ ఫ్రమ్ ద స్కైను పైలెట్ ప్రాజెక్టును ప్రస్తావించారు. నకిలీ సర్టిఫికెట్ల నివారణకు రాష్ట్ర సర్కారు విద్యాసంస్థల్లో వినియోగిస్తున్న బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి పేర్కొన్నారు.
సమర్థంగా ఎమర్జింగ్ టెక్నాలజీల వాడకం
ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన ఎమర్జింగ్ టెక్నాలజీస్‌ను సమర్థంగా వాడుకునేందుకు తెలంగాణ ఐటీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ చేపట్టిన కార్యక్రమాలను సదస్సులో ప్రత్యేకంగా వివరించారు. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ), డ్రోన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), మిషన్ లెర్నింగ్, బిగ్ డాటా, బ్లాక్ చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్‌లను ఐటీ రంగంలో ఎమర్జింగ్ టెక్నాలజీస్‌గా గుర్తించినట్టు పేర్కొన్నారు.
వీటి ఆధారంగానే ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో కార్యకాలాపాలు, సరికొత్త ఆవిష్కరణలు చోటుచేసుకొంటున్నాయని గుర్తుచేశారు. ఒక్కో టెక్నాలజీకి ఒక ప్రేమ్ వర్క్ రూపొందించి అమలుచేస్తున్నట్టు తెలంగాణ ఐటీశాఖ అధికారులు సదస్సులో ప్రజెంటేషన్ ఇచ్చారు. క్లౌడ్ అడాప్షన్ పాలసీ కింద క్లౌడ్ అడాప్షన్ జీవోను, ఫ్రేమ్ వర్క్-2020, ఏఐ ప్రేమ్ వర్క్-2020, డ్రోన్ ప్రేమ్ వర్క్-2019, బ్లాక్ చైయిన్ ప్రేమ్‌వర్క్-2019ను అమల్లోకి తీసుకొచ్చినట్టు ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్ సదస్సులో ప్రధానంగా వివరించారు.