హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుపై రాష్ట్ర హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినట్టు నిర్ధారించింది. ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్, అదే పార్టీలో కొనసాగుతూనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ద్వారా బీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. దానం నాగేందర్ 2024 ఏప్రిల్ 23న కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని 2(1)(ఏ)తోపాటు ఆర్టికల్ 191(2) ప్రకారం ఎమ్మెల్యే పదవికి అనర్హుడని ప్రకటించింది.
ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు స్పష్టంచేసింది. అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ ఈ ఏడాది మార్చి 11న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. దానం నాగేందర్‌పై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి 2024 మార్చి 18న, బీజేపీ శానససభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి 2024 జూలై 1న స్పీకర్ వద్ద పిటిషన్ దాఖలు చేశారు. వీటిని స్పీకర్ కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ ఇద్దరూ వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ఇరుపక్షాల వాదనల విన్న ధర్మాసనం ఆగస్టు 21న తీర్పును రిజర్వు చేసింది. శుక్రవారం 91 పేజీల కీలక తీర్పును వెలువరించింది.
అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ ఈ ఏడాది మార్చి 11న వాటిని కొట్టివేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ తన ఉత్తర్వులో ప్రధానంగా.. పదో షెడ్యూల్ కింద తన పరిధి శాసనసభలోని కార్యకలాపాలతో ముడిపడి ఉంటుందని, సభ వెలుపల సభ్యుడి రాజకీయ కార్యకలాపాలను ఆధారంగా చేసుకొని అనర్హత ప్రకటించలేమని పేరొన్నారు. బీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టు తేల్చడానికి 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడం మాత్రమే సరిపోదని, దానం నాగేందర్ బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదని, కాంగ్రెస్‌లో అధికారికంగా చేరినట్టు నిరూపించే సభ్యత్వ ఆధారాలు లేవని, బీఆర్ఎస్ కూడా ఆయనపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని స్పీకర్ అభిప్రాయపడ్డారు.
స్పీకర్ వెల్లడించిన కారణాలను హైకోర్టు తోసిపుచ్చింది. పదో షెడ్యూల్ కింద అనర్హతను నిర్ణయించేటప్పుడు అసెంబ్లీలో సభ్యుడి ప్రవర్తన, ఓటింగ్‌కే పరిమితం కావాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం కీలకమైన ‘సభ వెలుపలి చర్య’గా కోర్టు పరిగణించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలు చేయడం, ఆ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయడం వంటి చర్యలు ఆయన మొదటి పార్టీ పట్ల రాజకీయ అనుబంధాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టు నిర్ధారించడానికి సరిపోతాయని స్పష్టం చేసింది.
శాసనసభ వెలుపల జరిగిన చర్యల ఆధారంగానూ పదో షెడ్యూల్ కింద అనర్హతను నిర్ధారించవచ్చని డాక్టర్ మహాచంద్రప్రసాద్సింగ్ వర్సెస్ చైర్మన్, బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ధర్మాసనం పేర్కొన్నది. ఇదే అంశంపై సుప్రీంకోర్టు గతంలో రవి ఎస్ నాయక్, ఆర్ భూపతిరెడ్డి, కొండా మురళీధర్‌రావు, రాజేంద్రసింగ్ రాణా తదితర కేసుల్లో కూడా సభ వెలుపల ప్రవర్తన ఆధారంగా పదో షెడ్యూల్ కింద అనర్హత వేటు తీర్పులు వెలువడ్డాయని గుర్తుచేసింది. ఈ మేరకు దానం నాగేందర్ కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకొని, ఆయనపై పదో షెడ్యూల్ 2(1)(ఏ) కింద అనర్హతను నిర్ణయించవచ్చని ధర్మాసనం పేర్కొన్నది.
ధర్మాసనం తన తీర్పులో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధి, స్పీకర్ అధికారాలు, న్యాయ సమీక్ష పరిధి, సాక్ష్యాల ప్రాముఖ్యత, అనర్హత అమల్లోకి వచ్చే తేదీ తదితర అంశాలను సమగ్రంగా విశ్లేషించింది. రాజ్యాంగ ఆదేశాల ఉల్లంఘన, దురుద్దేశం, సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన, చట్టపరంగా నిలబడని నిర్ణయం వంటి నాలుగు అంశాలపై హైకోర్టు ఆర్టికల్ 226 కింద జోక్యం చేసుకోవచ్చని వివరించింది. స్పీకర్ పదో షెడ్యూల్ కింద వ్యవహరించేటప్పుడు ట్రిబ్యునల్ చైర్మన్ పదవిలో విధులు నిర్వహిస్తారని, కాబట్టి ట్రిబ్యునల్ నిర్ణయాలను న్యాయ సమీక్ష చేయవచ్చని తేల్చిచెప్పింది. దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ ఎలాంటి క్రమశిక్షణ చర్య తీసుకోకపోవడం, ఆయనను పార్టీ సభ్యుడిగా కొనసాగించడం, అసెంబ్లీలో పార్టీ విప్‌లను పాటించడం తదితర అంశాలను స్పీకర్ కీలకంగా పరిగణించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.
ఇది పదో షెడ్యూల్లోని 2(1)(బీ) కింద ఏర్పడిన అనర్హతను తొలగించవని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీ విప్‌కు విరుద్ధంగా సభలో ఓటు వేయడం లేదా ఓటింగ్‌కు దూరంగా ఉండడం వంటి పరిస్థితులకు సంబంధించిన 2(1)(ఏ)లో పార్టీ క్షమాపణకు ఆసారం ఉంటుందని, కానీ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్న అంశాన్ని పరిశీలించే 2(1)(ఏ)లో అదే సూత్రాన్ని వర్తింపజేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ రికార్డుల్లో కొనసాగడం లేదా పార్టీ ఆయనపై క్రమశిక్షణ చర్య తీసుకోకపోవడం వల్ల 2024 ఏప్రిల్ 23న జరిగిన అనర్హత చర్య చెరిగిపోదని పేర్కొన్నది. అనర్హత పిటిషన్లో ప్రతి అనుబంధ పత్రాన్ని సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ధ్రువీకరించలేదన్న స్పీకర్ ఉత్తర్వులను హైకోర్టు తోసిపుచ్చింది.
రవి ఎస్ నాయక్, డాక్టర్ మహాచంద్రప్రసాద్సింగ్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావిస్తూ.. 1986 నాటి డిస్క్వాలిఫికేషన్ రూల్స్ ‘ప్రక్రియాపరమైనవి’ మాత్రమేనని చెప్పింది. వాటిని తప్పనిసరి నిబంధనలుగా చదివితే పదో షెడ్యూల్ ఉద్దేశమే దెబ్బతింటుందని పేరొన్నది. చిన్నపాటి ప్రక్రియాపరమైన లోపాన్ని చూపించి వాస్తవంగా అనర్హతకు గురైన సభ్యుడు తప్పించుకునే పరిస్థితి రాకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది. కాబట్టి రూల్ 6(6), 6(7)లోని ధ్రువీకరణ లోపాలను ఆధారంగా చేసుకొని అనర్హత పిటిషన్‌ను కొట్టివేయడం చట్టబద్ధం కాదని పేర్కొన్నది.
దానం నాగేందర్ అనర్హత వ్యవహారంపై పిటిషన్లు దాఖలైనప్పటి నుంచి ఇప్పటివరకు శాసనసభ పదవీకాలంలో దాదాపు మూడేండ్లు గడిచిపోయిందని ధర్మాసనం పేర్కొన్నది. 2025 జూలై 31న సుప్రీంకోర్టు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించినా, స్పీకర్ 2026 మార్చి 11న మాత్రమే ఉత్తర్వులు ఇచ్చారని గుర్తుచేసింది. ఈ పరిస్థితుల్లో కేసును మళ్లీ స్పీకర్ వద్దకు పంపితే విచారణ మరింత ఆలస్యం అవుతుందని అభిప్రాయపడింది.
దానం నాగేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన 2024 ఏప్రిల్ 23 తేదీనే బీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు పరిగణించాలని హైకోర్టు ప్రకటించింది. సుభాష్ దేశాయ్, శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా.. అనర్హతకు దారితీసిన చర్య జరిగిన రోజు నుంచే అనర్హత నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది. 2026 మార్చి 11న దానం నాగేందర్‌కు అనుకూలంగా స్పీకర్ ఇచ్చిన రెండు ఉత్తర్వులను హైకోర్టు పూర్తిగా పకనపెట్టింది. దానం నాగేందర్ 2024 ఏప్రిల్ 23 నుంచే తెలంగాణ శాసనసభ సభ్యుడిగా అనర్హుడని ప్రకటించింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు ప్రకటించింది.
శుక్రవారం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు తర్వాత పలు సందేహాలు తలెత్తుతున్నాయి. తీర్పు ప్రకారం కాంగ్రెస్ పార్టీ బీ ఫారం తీసుకుని నామినేషన్ వేసినప్పటి నుంచి దానం నాగేందర్ అనర్హత (2024 ఏప్రిల్ 23 నుంచి) అమల్లోకి వస్తుంది. దీంతో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగిన గడిచిన దాదాపు ఏడాదిన్నర కాలానికి సంబంధించిన పరిణామాలు, ఖైరతాబాద్ నియోజకవర్గంలో రాజ్యాంగపరమైన చర్యలు వంటివి ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు టీ ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఎం సంజయ్‌కుమార్‌పై అనర్హత వేటు కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, కేపీ వివేకానంద, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, జీ జగదీశ్‌రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఈ వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ , జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతున్నది. వీటిపై తదుపరి విచారణను అక్టోబర్ 6కి వాయిదా వేస్తున్నట్టు 2రోజుల కిందట ధర్మాసనం ప్రకటించింది.
దానం నాగేందర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందడం, 2024 ఏప్రిల్ 23న కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్‌సభకు నామినేషన్ దాఖలు చేశారనడంపై ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని హైకోర్టు చెప్పింది. ఈ విషయాన్ని దానం నాగేందర్ కూడా వ్యతిరేకించడం లేదని, దీనికి ఆయన దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌లోని అంశాలే నిదర్శమని పేర్కొన్నది. 2024 ఏప్రిల్ 23న లోక్‌సభ ఎన్నికల కోసం సమర్పించిన ఫారం- 26లోనే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పేరొన్నారని, ఫారం-7ఏలో కూడా కాంగ్రెస్ పార్టీ, ‘హస్తం’ గుర్తుతోపాటు దానం నాగేందర్ పేరు కూడా ఉన్నదని కోర్టు గుర్తుచేసింది.
ఈ వాస్తవాలను దానం నాగేందర్ తన కౌంటర్లో ఖండించలేదని పేరొన్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫారం- 26, ఎన్నికైన సభ్యుల గెజిట్ నోటిఫికేషన్, 2024 ఏప్రిల్ 23న లోక్‌సభ ఎన్నికల కోసం సమర్పించిన ఫారం- 26, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థుల తుది జాబితా, పోటీకి కాంగ్రెస్ అభ్యర్థిగా పొందిన బీఫారం మొదలైనవన్నీ పార్టీ ఫిరాయింపునకు పాల్పడినట్టు ఆధారాలేనని స్పష్టం చేసింది. పాడి కౌశిక్‌రెడ్డి తన పిటిషన్లో పై ఆధారాలతోపాటు 2024 మార్చి 15న దానం నాగేందర్ కాంగ్రెస్ నేతలను కలవడం, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పించుకోవడం, ఆ పార్టీలో చేరినట్టు వచ్చిన వార్తలు, సోషల్‌మీడియా పోస్టులు వంటివాటిని కూడా ఆధారాలుగా పేర్కొన్నారని, అయితే కోర్టు దృష్టిలో మీడియా కథనాలు ప్రధానాంశం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది.
బీఆర్ఎస్ అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నిక కావడం, కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం, కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలు చేయడం, బీఆర్ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం వంటి కీలక వాస్తవాలను దానం నాగేందర్ ఖండించలేదని గుర్తుచేసింది. జగ్జీత్సింగ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పినట్టుగా.. అంగీకారం ఉత్తమ సాక్ష్యమని, ఇకడ దానం నాగేందరే తన అఫిడవిట్లో సికింద్రాబాద్ లోక్‌సభ సీటుకు కాంగ్రెస్ తరఫున పోటీ చేసినట్టు అంగీకరించడమే అత్యుత్తమ సాక్ష్యమని తేల్చి చెప్పింది.
ధర్మాసనం తీర్పు వెలువరించిన వెంటనే దానం నాగేందర్ తరఫు న్యాయవాది కల్పించుకొని.. తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. అప్పటివరకు తీర్పు అమలును సస్పెన్షన్‌లో ఉంచాలని కోరారు. దీనిపై పాడి కౌశిక్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు స్పందిస్తూ, ఇప్పటికే పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ రెండున్నర సంవత్సరాలుగా అన్యాయంగా పదవిని అనుభవించారని గుర్తుచేశారు. ఇలాంటి ఫిరాయింపు ఎమ్మెల్యే ఒకరోజు కూడా పదవిలో కొనసాగడానికి వీల్లేదని, అర్హత కూడా లేదని చెప్పారు. ఈ వాదనను ధర్మాసనం ఆమోదిస్తూ.. తీర్పు తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. తీర్పు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి, శాసనసభ కార్యదర్శికి పంపాలని రిజిస్ట్రీకి ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తేతెలంగాణ):దానం నాగేందర్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ ర్ పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దుచేయాలని బీఆర్ఎస్ కొన్నేండ్లుగా చేసిన పోరాటానికి ఇది ప్రతిఫలమని తెలిపా రు. అనర్హత పిటిషన్లపై గతంలో స్పీకర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని న్యాయస్థానం కొట్టివేయడం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియకు ఊతమిచ్చిందని చెప్పారు. ఇప్పటికైనా రేవంత్ సర్కారు ఫిరాయింపుదార్లను ప్రోత్సహించడం మానుకోవాలని హితవుపలికారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని, వారు తీసుకోకపోతే ఇతర సంస్థలు ఆ బాధ్యత తీసుకుంటాయని మాజీ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి చెప్పారు. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ జాప్యం చేశారని, ఆయన పరిధిలో ఉన్నపుడే నిర్ణ యం తీసుకొని ఉంటే హైకోర్టుకు ఆ అవకాశం ఉండేది కాదని అన్నారు. దానం నాగేందర్ విషయంలో వెలువడిన తీర్పు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక ఉదాహరణగా నిలిచిపోతుందని తెలిపారు. పార్టీలు మారే వారికి ఇదో గుణపాఠంగా ఉంటుందని అన్నారు.
పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం స్ఫూర్తిని కాపాడే దిశగా ఈ తీర్పు కీలకమని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కే కిశోర్‌గౌడ్ పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరోపార్టీలోకి వెళ్లినవారికి న్యాయస్థానం కనువిప్పు కలిగించిందని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన మిగిలిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని స్పష్టంచేశారు.
దానం నాగేందర్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య విజయమని కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. ప్రజాతీర్పును అపహాస్యం చేయడం ప్రజాప్రతినిధులకు తగదన్నారు. పార్టీ మారే ప్రజాప్రతినిధులకు ఈ తీర్పు కండ్లు తెరిపించిందని పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): పాలకపక్షం ఎన్ని కుట్రలు, కక్షసాధింపు రాజ కీయాలు చేసినా దేశంలో న్యాయ వ్యవస్థ బలంగా ఉందని ఇటీవల వెలువడిన రెండు కోర్టు తీర్పులు స్పష్టం చేశాయని బీఆర్ఎస్ ఎన్ఆర్ ఐ సౌత్ఆఫ్రికా నాయకుడు నాగ రాజు గుర్రాల పేరొన్నారు. దానం నాగేందర్‌పై హై కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేల విషయంలోనూ రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం త్వరితగతిన, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.