జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాష్ట్రంలోని నేతన్నలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ కేవలం 170 నిమిషాల్లో అగ్గిపెట్టెలో అమరే సూక్ష్మ చీరను నేసి రికార్డు సృష్టించిన వీడియోను గవర్నర్ తన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
చేనేత భారతీయ సంస్కృతికి ప్రతీక అని, తెలంగాణ నేతన్నలు తమ నైపుణ్యం, సృజనాత్మకతతో రాష్ట్ర చేనేతకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ సందర్భంగా తెలిపారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిరిసిల్ల, కొత్తకోట చేనేత సంప్రదాయాలు తెలంగాణ గొప్ప వస్త్ర వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. “సమాజానికి సంస్కృతిని నేర్పిన నేర్పరులు నేతన్నలు. వారి కళాత్మక నైపుణ్యం మన సంప్రదాయాలను సజీవంగా ఉంచుతూ తెలంగాణకు చిరస్థాయి గుర్తింపు తీసుకొచ్చింది” అని గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు.
వేలాది కుటుంబాలకు చేనేత పరిశ్రమ జీవనాధారంగా నిలుస్తోందని, ‘వోకల్ ఫర్ లోకల్’ స్ఫూర్తితో ప్రజలు చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి వినియోగించడం ద్వారా నేతన్నలను ప్రోత్సహించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. చేనేత ఉత్పత్తుల వినియోగం పెరగడం వల్ల నేతన్నల జీవితాల్లో మరింత వెలుగులు నిండుతాయని ఆయన ఆకాంక్షించారు.
National Handloom Day | Telangana Governor greets weavers
On the occasion of National Handloom Day, Hon’ble Governor of Telangana Shri Shiv Pratap Shukla extended his heartfelt greetings to the weavers of the State.
In a message, the Governor described handloom as a proud… pic.twitter.com/2Rcf0mOsHu
— Governor of Telangana (@tg_governor) August 7, 2026