టెలివిజన్ రంగంలోని కళాకారుల ప్రతిభను గుర్తించి సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ టెలివిజన్ అవార్డ్స్ 2024’ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ అవార్డ్స్‌కు సంబంధించిన విధివిధానాలు, నియమావళి, లోగో తదితర అంశాలను ఖరారు చేసేందుకు ఓ ఉన్నతస్థాయి కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 15మంచి సభ్యులతో కూడిన ఈ కమిటీకి కన్వీనర్‌గా TG FDC ఎండీ ఉంటారు. ప్రముఖ నిర్మాత శరత్‌మరార్ ఛైర్మన్‌గా, టెలివిజన్ పరిశ్రమ నుంచి కె.బాపినీడు, మంజులనాయుడు, పి.కిరణ్ సహసభ్యులుగా వ్యవహరిస్తారు.
టెలివిజన్‌కు సంబంధించిన అన్ని విభాగాలలో పారదర్శకత, సమగ్రత, సృజనాత్మక నైపుణ్యాన్ని నిర్ధారించే బాధ్యతను ఈ ప్యానల్‌కే అప్పగించారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ‘సినిమా, టెలివిజన్ రంగాలకు కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం ఎదిగింది. స్థానిక సృజనాత్మక ప్రతిభను గౌరవించే వేదికగా ఈ అవార్డ్స్ వేడుక నిలువనున్నది. టెలివిజన్ రంగానికి చెందిన అన్ని క్రాఫ్ట్లకూ ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది ’ అని తెలిపారు.