ప్రియదర్శి నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా ‘ప్రేమంటే’. ‘Thrill – U – Prapthirasthu’ ఉపశీర్షిక. ఆనంది కథానాయిక. సుమ కనకాల కీలక పాత్ర పోషించారు. నవనీత్ శ్రీరామ్ దర్శకుడు. పుస్కూర్ రామ్మోహన్రావు, జాన్వీ నారంగ్ నిర్మాతలు. రానా దగ్గుబాటి సమర్పకుడు. ఈ నెల 21న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం సినిమాలోని రెండోపాటను మేకర్స్ విడుదల చేశారు. ‘పెళ్లి షురు..’ అంటూ సాగే ఈ పాటను అగ్ర కథానాయిక శ్రీలీల ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల కారణంగా సినిమాకు మంచి హైప్ ఏర్పడిందని, తొలిపాట ‘దోచావే..’
ఆడియన్స్ మనసుల్ని దోచిందని, ఈ మలిపాట ఆనందోత్సాహాలతో నిండిన పెళ్లి పాట అని, హీరోహీరోయిన్ల పెళ్లి సంబరాన్ని ఆవిష్కరించేలా ఈ పాట సాగుతుందని మేకర్స్ తెలిపారు. ‘పెళ్లి షురూ.. హే.. పెళ్లి షురు.. దంచికొట్టు మేళం.. అదరగొట్టు తాళం.. ’ అంటూ సాగే ఈ పెళ్లి పాటను శ్రీమణి రాయగా, లియోన్ జేమ్స్ స్వరపరిచారు. శ్రేయా ఘోషల్ ఆలపించారు. పెళ్లి కొడుకు, పెళ్లికూతురు వేషధారణల్లో ప్రియదర్శి, ఆనంది బ్యూటిఫుల్ డాన్స్ మూమెంట్స్‌తో అలరించారు. ఈ చిత్రానికి మాటలు: కార్తీక్ తుపురాణి, రాజ్‌కుమార్, కెమెరా: విశ్వనాథరెడ్డి, సహనిర్మాత: ఆదిత్య మేరుగ, నిర్మాణం: ఎస్వీసీఎల్ఎల్పీ, స్పిరిట్ మీడియా.