హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో నర్సుల కొరత తీవ్రంగా ఉన్నదని కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకా రం.. తెలంగాణలో 47% నర్సుల కొరత ఉన్నదని కేంద్రం తెలిపింది. ఈ మే రకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభకు డాటా సమర్పించారు. రాష్ట్రంలో రిజిస్టర్డ్ నర్సులు, మిడ్వైవ్స్ 60,919 మంది ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 3.8 కోట్ల జనాభా ఉన్నట్టు కేంద్రం అంచనా వేయగా.. వెయ్యి మందికీ 1.58 నర్సులే ఉన్నారని స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్వో ప్రమాణాల ప్రకారం రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది జనాభాకు ముగ్గురు నర్సులుండాలి. కేరళలో వె య్యి మంది జనాభాకూ 10.47 మంది, కర్ణాటకలో 7.69, ఆంధ్రప్రదేశ్లో 5.72, తమిళనాడులో 5.09 మంది ఉన్నట్టు వెల్లడించింది. డబ్ల్యూహెచ్ వో నిబంధనల ప్ర కారం రాష్ట్రంలో 1.16 లక్షల మం ది నర్సులు ఉండాల్సి ఉండగా.. 55 వేల నర్సుల కొరత ఉన్నట్టు గణాంకాలు తెలిపాయి.
సంఖ్యాపరంగా దక్షిణాది రాష్ర్టాల్లో నర్సుల సంఖ్యలో తెలంగాణ వెనుకబడి ఉన్నట్టు కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో 60,919 మంది నర్సులు ఉండగా.. కర్ణాటకలో 5.3 లక్షలు, తమిళనాడులో 4.14 లక్షలు, కేరళలో 3.84 లక్షలు, ఆంధ్రప్రదేశ్లో 3.06 లక్షల మంది నర్సులు ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. జాతీయ సగటు ప్రతి వెయ్యి మందికీ 2.45 నర్సులు ఉండగా, తెలంగాణ దక్షిణాది రాష్ర్టాల జాబితాలో చివరన నిలిచినట్టు కేంద్రం తెలిపింది. మరోవైపు, రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వెళ్లే నర్సుల కారణంగా నర్సుల కొరత రాలేదని కేంద్రం స్పష్టం చేసింది. 2024లో 140 మంది, 2025లో 94 మంది నర్సులు మాత్రమే ఇతర దేశాలకు వెళ్లినట్టు కేంద్రం వెల్లడించింది.
ఆరోగ్య శాఖ పటిష్టంగా ఉండాలంటే తగినంతమంది నర్సులు ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నర్సులు రోగులతో ఎక్కువ సమయం గడపడంతోపాటు అందుతున్న చికిత్స, రోగికి ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే గుర్తిస్తారని చెప్తున్నారు. దవాఖానలోని ఆయా విభాగాలతో సమన్వయం చేసుకోవడంతోపాటు ఇన్ఫెక్షన్లు సోకకుండా నివారిస్తారని పేర్కొంటున్నారు. నర్సుల కొరత రోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇప్పటికే ఉన్న సిబ్బందిపై తీవ్రమైన పనిభారం పడుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతో పేషెంట్లకు అందుతున్న సేవల్లో నాణ్యత తగ్గుతుందని చెప్తున్నారు. ఎక్కువ మంది రోగులు వచ్చే పెద్ద దవాఖానలపై ఈ భారం మరింత ఎక్కువగా ఉంటుందని వివరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నర్సుల కొరత తీర్చేందుకు చర్యలు చేపట్టాలని వైద్యరంగ నిపుణులు సూచిస్తున్నారు.
